రెండు రోజుల కిందట రిలీజైన ‘వారణాసి’ గ్లింప్స్‌లో అందరినీ ఆకర్షించిన, ఒక రకమైన గగుర్పాటు కలిగించిన ఒక షాట్ ఉంది. వణాంచల్‌లోని ఉగ్రబట్టి గుహ అని చూపించాక.. ఆ గుహ లోపల శిరస్సు లేకుండా ఉన్న దేవత రూపాన్ని భయంకరమైన అవతారంలో దర్శనమివ్వడాన్ని గమనించవచ్చు. ఈ దేవతకు కథకు లింక్ ఏముందో కానీ.. అసలు అలాంటి రూపంలో ఉన్న దేవత ఎవరు అనే ఆసక్తి కలిగి ఉంటుంది. కొందరికి ఈ దేవత గురించి తెలిసి ఉండొచ్చు. తెలియని వారికి ఆ దేవత గురించి పురాణాల్లో ఉన్న కథలేంటో చూద్దాం.
‘వారణాసి’ గ్లింప్స్‌లో చూపించిన దేవత పేరు.. చిన్నమస్తాదేవి. ఆమె పార్వతీదేవి మరో అవతారంగా చెప్పొచ్చు. ఈ గ్లింప్స్‌లోనే కాదు.. చిన్నమస్తాదేవికి సంబంధించిన ఆలయాల్లో కూడా ఆమె ఇలాగే భయంకరమైన అవతారంలోనే కనిపిస్తుంది. ఖండించిన శిరస్సు నుంచి మూడు రక్తధారలు వస్తుంటాయి. అందులో ఒకటి ఖండిత శిరస్సు నోట్లోకే వెళ్తూ ఉంటుంది. మిగతా రెండు ధారలను ఇంకో ఇద్దరి నోళ్లలోకి వెళ్తుంటాయి. ఆ ఇద్దరు జయ, విజయ అనే దేవతలు. వారికి ఢాకిని, వర్ణిని అనే పేర్లు కూడా ఉన్నాయి.
‘చిన్నమస్తా’లో చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే తల అని అర్థం. ఈ రూపాన్ని శక్తి యొక్క రౌద్ర రూపంగా భావిస్తారు. పార్వతీదేవి ఇలా తలను ఖండించుకోవడం, రక్త ధారలు ఇలా చిమ్మడం.. స్వయంగా పార్వతీదేవితో పాటు దేవతలు రక్తాన్ని తాగడం వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఒక కథ ప్రకారం పార్వతీ దేవి తన సేవకురాలైన ఢాకిని, వర్ణినిలతో కలిసి ఒక నదిలో స్నానం ఆచరిస్తుండగా.. ఢాకిని, వర్ణిని తమ ఆకలి తీర్చమని అడిగారట. ఐతే పార్వతీదేవి చుట్టు పక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదట.
ఐతే ఆలస్యం అయ్యేకొద్దీ ఆకలి వల్ల ఢాకిని, వర్ణినిల శరీరం నల్లగా మారిపోయిందట. అప్పుడా ఇద్దరూ మీరు ఈ జగత్తుకే తల్లి, మా ఆకలి తీర్చలేరా అంటే.. పార్వతీదేవి తన శిరస్సును ఖండించుకుని.. అందులోంచి వచ్చే రక్త ధారలతో వారి ఆకలి తీర్చిందట. స్వయంగా తానూ ఆ రక్తాన్ని తాగిందట.
ఇంకో కథ ప్రకారం ఒక సమయంలో దేవతలకు, రాక్షసులకు యుద్ధం రాగా.. రాక్షసుల ధాటికి తట్టుకోలేకపోయిన దేవతలు పార్వతీదేవిని రక్షించమని ప్రార్థిస్తారట. అప్పుడు జయ, విజయలతో కలిసి పార్వతీదేవి యుద్ధం చేస్తారు. చాలా కాలం పాటు యుద్ధం చేయడంతో జయ, విజయ శక్తి హీనులవుతారు. వారిని ఆకలి బాధ పీడిస్తుంది. యుద్ధ భూమి కావడంతో తినడానికి ఏమీ దొరక్క పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆమె తన శిరస్సును ఖండించుకుని వారికి రక్తం ద్వారా శక్తినిస్తుంది. తానూ ఆ రక్తాన్ని తాగుతుంది. తర్వాత ముగ్గురూ కలిసి రాక్షసులను సంహరిస్తారు.
చిన్నమస్తాదేవి రూపం భయంకరంగా ఉన్నప్పటికీ ఆమెను కరుణామూర్తిగా, త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దేవతను ఇళ్లలో కొలవరు. ఆలయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉత్తర భారత దేశంలో, అలాగే నేపాల్‌లో చిన్నమస్తాదేవి ఆలయాలున్నాయి. తంత్ర విద్య కోసం, అతీత శక్తుల కోసం ఈ దేవతను పూజిస్తారని చెబుతారు. మరి ఈ దేవతతో ‘వారణాసి’ కథకు ఉన్న లింక్ ఏంటన్నది సినిమా రిలీజైనపుడే తెలుసుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates