రానా ఎట్టకేలకు..

టాలీవుడ్లో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే అందరు హీరోలూ కరోనా విరామం తర్వాత షూటింగ్ మొదలు పెట్టేశారు. గత రెండు నెలల్లో స్టార్లు ఒక్కొక్కరుగా సెట్‌లోకి అడుగు పెట్టేశారు. బడా హీరోల్లో చిరంజీవి, మహేష్ బాబు మాత్రమే ఇంకా షూటింగ్‌లో పాల్గొనట్లేదు. ఇంకొన్ని రోజుల్లోనే వాళ్లిద్దరూ కూడా తమ సినిమాల సెట్లలోకి అడుగు పెడుతున్నారు.

ఈలోపు మిగతా హీరోలతో పోలిస్తే కరోనా పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన దగ్గుబాటి రానా సైతం షూటింగ్‌కు వచ్చేయడం విశేషం. అతను నటిస్తున్న ‘విరాట పర్వం’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. దాన్నే ఇప్పుడు మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో పూర్తిగా రాత్రి పూటే సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. సినిమాలో ఇవి కీలకమైన సన్నివేశాలుగా చెబుతున్నారు.

రానా గత ఏడాది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పుడు ప్రాణాపాయం కూడా ఎదుర్కొన్నట్లు స్వయంగా రానానే వెల్లడించాడు. ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నప్పటికీ.. వేరే అనారోగ్య సమస్యలున్న వారిపై కరోనా చేసే దాడి గురించి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానా జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే తన తోటి యువ కథానాయకులందరూ మళ్లీ షూటింగ్‌కు హాజరవుతున్నప్పటికీ రానా ఆగాడు.

ఐతే ఇప్పుడు కరోనా ప్రభావం చాలా వరకు తగ్గిన నేపథ్యంలో రానా ధైర్యం చేస్తున్నాడు. అత్యంత జాగ్రత్తల మధ్య ఈ సినిమా చిత్రీకరణ సాగుతోందట. ‘నీదీ నాదీ ఒకే కథ’తో అరంగేట్రంలోనే గొప్ప పేరు సంపాదించిన వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రానా సరసన సాయిపల్లవి నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.