సిక్సర్ కొట్టిన చరణ్ ‘చికిరి’ స్టెప్పులు

మెగా ఫ్యాన్స్ ఎదురు చూసిన చికిరి చికిరి సాంగ్ వచ్చేసింది. లిరికల్ వీడియో కాబట్టి పెద్దగా స్టెప్స్ రివీల్ చేయరేమోననే అభిమానుల అంచనాలకు భిన్నంగా ఎక్కువ కంటెంట్ చూపించడం ద్వారా దర్శకుడు బుచ్చిబాబు కొత్త స్ట్రాటజీకి శ్రీకారం చుట్టారు. టీజర్ లో విపరీతంగా వైరలైన సిగ్నేచర్ క్రికెట్ షాట్ ని డాన్స్ రూపంలో కంపోజ్ చేయించడంతో పాటు బ్యాటు పట్టుకుని రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చాలా కొత్తగా ఉన్నాయి. ఇప్పటికీ గ్రేస్ తగ్గలేదని చరణ్ మీద మూవీ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన మాస్ లుక్స్ మీద తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. మొత్తానికి సిక్సర్ స్టేడియం దాటేసింది.

పాటలో సాహిత్యం కూడా ఊరనాటుగా ఉంది. చంద్రుళ్ళో ముక్క వచ్చిందే దీనెక్క అంటూ బాలాజీ రాసిన లిరిక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. జాన్వీ కపూర్ ని ఊహించనంత మాస్ గా చూపించడం మరో ట్విస్టు. ఆమెతో ప్రత్యేకంగా నృత్యం చేయించనప్పటికీ పాట ఉద్దేశమే తనను పొగడటం కాబట్టి రామ్ చరణ్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. గేమ్ ఛేంజర్ ఏదైతే జనాలు లోటుగా ఫీలయ్యారో దాన్ని ఏఆర్ రెహమాన్ సంపూర్ణంగా నెరవేర్చారు. తమన్, అనిరుధ్ హవాలో సీనియర్ లెజెండరీ ఎలాంటి సాంగ్స్ ఇస్తారోనే అనుమానాలు లేకపోలేదు. వాటిని అదిరిపోయే ట్యూన్ ఇచ్చి రెహమాన్ సమాధానం చెప్పేశారు.

ప్రమోషన్లలో పెద్ది రెండు కీలక ఘట్టాలు పూర్తి చేసుకుంది. టీజర్, ఫస్ట్ సాంగ్ రెండూ ఇచ్చేశారు కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోబోతున్నారు. రిలీజ్ డేట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఒత్తిడి మీద షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది తిరిగి జనవరి నుంచి అప్డేట్స్ మొదలుపెట్టొచ్చు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. అయినా సరే వారాల తరబడి ట్రెండింగ్ అయ్యే స్టఫ్ బుచ్చిబాబు, రెహమాన్ ఇచ్చేశారు కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగానే ఉంటారు. మార్చి 27 విడుదల కాబోతున్న పెద్ది షూట్ ఇంకో నలభై శాతం దాకా పెండింగ్ ఉంది. ఫిబ్రవరిలోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో బుచ్చిబాబు చాలా కష్టపడుతున్నాడు. చరణ్ సహకారం కూడా అలాగే ఉంది.