మన పురాణ పాత్రల్లో ఆంజనేయుడు అత్యంత వినోదాన్నిచ్చే క్యారెక్టర్లలో ఒకటి. ఆ పాత్రను సరిగా ఉపయోగించుకుంటే ప్రేక్షకులను ఎంత ఎంటర్టైన్ చేయొచ్చో.. బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘హనుమాన్’ మూవీ రుజువు చేసింది. అందులో హనుమంతుడి పాత్ర మీద తక్కువ సన్నివేశాలే ఉన్నప్పటికీ.. అవి గూస్ బంప్స్ ఇచ్చాయి.
ఇప్పుడు తెలుగులో హనుమంతుడి మీదే పూర్తి స్థాయి సినిమా ఒకటి రాబోతోంది. ఐతే అది రెగ్యులర్ ఫీచర్ ఫిలిం కాదు. యానిమేషన్. ఇటీవలే ‘మహావతార నరసింహ’ ఇండియన్ యానిమేషన్ సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టి ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో దాని స్ఫూర్తితో తెలుగులో ‘వాయుపుత్ర’ చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చందు మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గురించి నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి అంత బలవంతుడు ఇంకొకరు లేరంటారు కదా. అలాంటి బలవంతుడిని మాస్ హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా కమర్షియల్ సినిమాల స్టయిల్లో చూపించబోతున్నాం. మీకు ప్రభాస్‌ను సలార్‌లో చూస్తే ఒక మాస్ హై ఎలా వస్తుందో.. అలా ఆంజనేయ స్వామిని చూస్తే హై వచ్చేలా చందు అన్ని సీక్వెన్సెస్ డిజైన్ చేశాడు.
సంక్రాంతికి ఒక టీజర్ ట్రై చేస్తున్నాం. ఆ టీజర్ చూసినపుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక మాస్ హీరోను చూసినట్లు ఫీలవుతారు ఆంజనేయస్వామిని చూస్తే. అలా కొత్తరకంగా యానిమేషన్ ట్రై చేస్తున్నాం’’ అని నాగవంశీ ‘వాయుపుత్ర’ గురించి ఇంట్రో ఇచ్చాడు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే ‘వాయుపుత్ర’ను భారీ సినిమాగానే తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లుంది. మరి నాగవంశీ చెబుతున్న రేంజిలో టీజర్ ఉంటుందో లేదో సంక్రాంతికి తెలుసుకుందాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates