త‌మ‌న్‌ను గిల్లుతున్న త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్?

గ‌త కొన్నేళ్ల‌లో సౌత్ ఇండియ‌న్ ఫిలిం మ్యూజిక్‌లో అనిరుధ్‌దే ఆధిప‌త్యం. జైల‌ర్, విక్ర‌మ్ లాంటి సినిమాల‌ను త‌న నేప‌థ్య సంగీతం, పాట‌ల‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. బీస్ట్, లియో, కూలీ లాంటి ఫ్లాప్ సినిమాల్లోనూ త‌న సంగీతానికి మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఐతే తెలుగు యూత్ సైతం అనిరుధ్ కోసం ఊగిపోతుండ‌డంతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఒకింత హ‌ర్ట్ అయిన‌ట్లు క‌నిపించాడు.

అనిరుధ్ సినిమాల లిస్టు చెప్పి.. వాట‌న్నింటికీ ఓజీతో స‌మాధానం ఇస్తా అంటూ ఒక ఇంట‌ర్వ్యూలో స‌వాలు విసిరాడు. ఓజీ రిలీజైన‌పుడు త‌న మాట‌ల్లో అతిశ‌యోక్తి ఏమీ లేద‌న్న ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. పాట‌లు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. త‌మ‌న్ మ్యూజిక్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు థియేట‌ర్ల‌లో పూన‌కాలు వ‌చ్చేశాయి. ద‌ర్శ‌కుడు సుజీత్, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం త‌మ‌న్ మీద ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు ఓటీటీ వెర్ష‌న్ కూడా త‌మ‌న్‌కు ప్ర‌శంస‌లు తెచ్చి పెడుతోంది.

ఐతే ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ కుమార్.. ఓజీ మీద త‌న ప్రేమను చాటుకుంటూ కొన్ని పోస్టులు పెడుతున్నాడు. సినిమాలో ప‌వ‌న్‌ను సూప‌ర్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన స‌న్నివేశాల వీడియోల‌ను అత‌ను ఫైర్ ఎమోజీల‌తో ఎక్స్‌లో షేర్ చేశాడు. కానీ ఆ స‌న్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఒరిజిన‌ల్ కాదు. త‌మ‌న్ స్కోర్ తీసేసి.. తాను కొన్ని మాస్ సినిమాల‌కు అందించిన బీజీఎంతో ఎడిట్ ( వేరే అభిమాని ) చేసిన వీడియో రీప్లేస్ చేసి వ‌దిలాడు జి.వి.

కొన్ని సౌండ్స్ కొత్త‌గా క్రియేట్ చేసిన‌ట్లు కూడా అనిపిస్తున్నాయి. ఓజీలో హీరో ఎలివేషన్ సీన్లు, షాట్‌లు జి.వి.కి బాగా న‌చ్చాయ‌న్న‌ది ఈ పోస్టుల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాను అయితే ఈ సన్నివేశాల‌కు బీజీఎంతో ఎలాంటి ఎలివేషన్ ఇచ్చేవాడినో జి.వి. చెప్ప‌ద‌లుచుకున్న‌ట్లున్నాడు. కానీ అదే స‌మ‌యంలో ఇది త‌మ‌న్‌ను గిల్లుతున్న‌ట్లు కూడా ఉంది. జి.వి. స్కోర్‌తో ఉన్న వీడియోల‌కు ఎక్స్‌లో అయితే పాజిటివ్ ఫీడ్ బ్యాకే వ‌స్తోంది. జి.వి తెలుగులో ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించాడు కానీ.. ప‌వ‌న్ లాంటి టాప్ స్టార్ల‌తో మాత్రం ప‌ని చేయ‌లేక‌పోయాడు.