సినిమాల ప్రమోషన్ల కోసం ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూల్లో పాల్గొనే సినీ తారలను సినీ జర్నలిస్టులు అడిగే స్థాయి తక్కువ ప్రశ్నల గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఒక ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ గురించి అడిగిన ప్రశ్న మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంచు లక్ష్మి సదరు జర్నలిస్టు మీద ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడం.. దీని మీద విచారణ జరగడం.. చివరికి ఆ జర్నలిస్టు వీడియో ద్వారా క్షమాపణ చెప్పడం తెలిసిందే.
ఇక కొందరు విలేకరులు ప్రెస్ మీట్లలో ఆర్టిస్టులను తీవ్ర ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుండడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్‌ను ఉద్దేశించి మీరు హీరో మెటీరియల్ కాదు కదా అని మాట్లాడ్డం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రశ్న అడిగి తీవ్ర విమర్శల పాలైన లేడీ జర్నలిస్టే తాజాగా.. సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించి మీరు నిజ జీవితంలో ఉమనైజరా అని అడగడం గమనార్హం. తెలుసు కదా ప్రెస్ మీట్లో సిద్ధుకు ఈ ప్రశ్న ఎదురైనా పట్టించుకోకుడా వదిలేశాడు.
ఈ వీడియో బయటికి రావడంతో సదరు జర్నలిస్టు మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డను మరుసటి రోజు మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్న గురించి ప్రస్తావించగా.. అతను స్పందించాడు. మీరు ఉమనైజరా అని ఆ జర్నలిస్ట్ తనను అడగడం గమనించానని.. ఆ పదం విన్నప్పటికీ.. స్పందించకూడదని తాను ఊరుకుని ఉండిపోయానని సిద్ధు చెప్పాడు. చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన ఆర్టిస్టులను ఏమైనా అడిగిచేయొచ్చు అనుకోవడం చాలా తప్పు అని సిద్ధు చెప్పాడు.
సినిమా వేరు నిజ జీవితం వేరు అని.. సినిమాలో మర్డర్స్ చేసే వాళ్ళు నిజంగా చంపుతారా అని సిద్దు ప్రశ్నించాడు. సదరు జర్నలిస్టు తనను ఐదు నిమిషాల ముందే ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేసిందని.. అప్పుడు అణకువగా మాట్లాడిన ఆమె.. తర్వాత ప్రెస్ మీట్‌కు వచ్చేసరికి అలాంటి ప్రశ్న వేసిందని సిద్ధు చెప్పాడు. ఆ మైక్ పట్టుకుంటే పవర్ వచ్చేస్తుందని.. అవతలి వాళ్లను ఏమైనా అడిగేయొచ్చు అనుకుంటారని.. అలాంటి ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఇస్తే దాన్ని వివాదాస్పదం చేయొచ్చు అనుకుంటారేమో అని సిద్ధు వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates