ఊహలు గుసగుసలాడే అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై మంచి బ్రేక్ అందుకున్న ఉత్తరాది భామ రాశి ఖన్నా.. తర్వాతి కాలంలో తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హీరోయిన్‌గా ఎదిగింది. తొలి ప్రేమ సహా కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా.. తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో మళ్లీ బిజీ అయింది. తెలుసు కదా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది రాశి.
ఓ ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇప్పటిదాకా తాను ఇద్దరు వ్యక్తులతో ప్రేమలో పడ్డట్లు రాశి వెల్లడించింది. సినీరంగంలోకి రావడానికి ముందే తనకు ఒక లవ్ స్టోరీ ఉందని రాశి తెలిపింది. కానీ అది మధ్యలో ఆగిపోయిందని ఆమె చెప్పింది. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా తాను ఒక వ్యక్తి ప్రేమలో పడ్డానని రాశి చెప్పింది. కానీ ఆ రిలేషన్‌షిప్ ఇంకా కొనసాగుతోందా లేదా అన్నది మాత్రం తాను చెప్పనని ఆమె తేల్చేసింది.
ఇక తన కెరీర్ గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు నాలుగు హిందీ చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. తన కెరీర్లో కథ కూడా వినకుండా ఒప్పుకున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని ఆమె తెలిపింది. పవన్ సినిమా అనగానే ఓకే చెప్పేశానని.. తర్వాతే కథ విన్నానని ఆమె చెప్పింది. పవన్‌కు స్పెషల్ స్వాగ్, ఆరా ఉన్నాయని.. వాటిని ఎవరూ మ్యాచ్ చేయలేరని రాశి వ్యాఖ్యానించింది.
ఈ చిత్రంలో పవన్‌తో తనకు అదిరిపోయే డ్యాన్స్ నంబర్ ఉందని ఆమె వెల్లడించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలన్నది తనకు కోరిక అన్న రాశి.. తొలి ప్రేమ తర్వాత తన క్యారెక్టర్ అంత బలంగా ఉన్న సినిమా తెలుసు కదా అని చెప్పింది. తెలుసు కదా మోడర్న్ రిలేషన్‌షిప్స్ చుట్టూ తిరిగే ట్రెండీ మూవీ అని, ఇది తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates