ఇది సుకుమార్ సహా అందరికీ కౌంటరే

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్లో ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటి. ఆ మాటకొస్తే ఇండియాలో కూడా పెద్ద బేనర్లలో ఒకటిగా ఎదిగింది. మలయాళంలో ‘ఏఆర్ఎం’, తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, హిందీలో ‘జాట్’ లాంటి భారీ చిత్రాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద రేంజికి ఎదిగే ప్రయత్నం చేస్తోంది మైత్రీ. తెలుగులో ‘పుష్ప’, ‘పుష్ప-2’, ‘రంగస్థలం’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’.. ఇలా ఆ సంస్థ ప్రతిష్టను పెంచిన మెగా హిట్లు చాలానే ఉన్నాయి. ఐతే పదేళ్లకు పైగా ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేసినా రాని సంతృప్తి తమ కొత్త సినిమా ‘డ్యూడ్’ విషయంలో వచ్చిందన్నట్లుగా ఇటీవల నిర్మాత రవిశంకర్ చేసిన ఒక కామెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు నాలుగు విషయాలు సరిగ్గా కుదిరాయని ఆయన చెప్పారు. 

అదిరిపోయే సబ్జెక్ట్‌తో సినిమా చేశామని.. చిత్రీకరణ మొదలుపెట్టాక 65-70 రోజుల్లోనే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా పూర్తి చేశామని.. అనుకున్న బడ్జెట్ లోపే సినిమా అయిందని.. అన్నింటికీ మించి ఔట్ పుట్ చూసుకున్నాక భలే సినిమా తీశామని పిచ్చ ఎగ్జైట్మెంట్ కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల నుంచి ఇవన్నీ కుదిరే సినిమా కోసం అన్వేషిస్తున్నామని.. ఎట్టకేలకు ‘డ్యూడ్’తోనే అది సాధ్యమైందని రవిశంకర్ అన్నారు. ఐతే మైత్రీ సంస్థలో ఇప్పటికే 30కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమాకు కూడా ఈ నాలుగు విషయాలూ సాధ్యపడలేదు అంటే ఆశ్చర్యం కలిగించే విషయం.

మైత్రీకి పుష్ప, పుష్ప-2, రంగస్థలం చిత్రాలతో భారీ విజయాలు అందించాడు సుకుమార్. కానీ ఆయన షూటింగ్ విషయంలో విపరీతమైన ఆలస్యం చేశాడు. అలాగే వాటి బడ్జెట్లూ దాటిపోయాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు కూడా అనుకున్న సమయంలో, బడ్జెట్లో పూర్తి కానట్లే. బహుశా తక్కువ రోజుల్లో, అనుకున్న బడ్జెట్లో తీసిన సినిమాలు కోరుకున్న విజయాలు అందించి ఉండకపోవచ్చు. రవిశంకర్ ఎవరినో టార్గెట్ చేయాలని అనుకుని ఉండకపోవచ్చు కానీ.. ఆయన కామెంట్ సుకుమార్ సహా మైత్రీ సంస్థలో పని చేసిన దర్శకులందరికీ చిన్న కౌంటర్ వేశారని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.