జిరాక్స్ షాప్ నడుపుతున్న హీరో తండ్రి

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి వచ్చే నటులు, టెక్నీషియన్ల జీవితాలు ఒక దశ వరకు సాధారణంగానే ఉంటాయి. కానీ వాళ్లకు మంచి బ్రేక్ వచ్చిందంటే రాత్రికి రాత్రి అంతా మారిపోతుంది. అందులోనూ నటుడిగా, దర్శకుడిగా మంచి బ్రేక్ అందుకుంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ సెలబ్రెటీతో పాటు కుటుంబ సభ్యులందరూ లగ్జరీలకు అలవాటు పడిపోతారు. 

కానీ ఎంత సంపద వచ్చి పడినా.. సాధారణ జీవితమే గడిపేవాళ్లు అరుదుగా ఉంటారు. తన తండ్రి అలాంటి వ్యక్తే అంటున్నాడు డైరెక్టర్, యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. ‘లవ్ టుడే’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘డ్రాగన్’ మూవీతో తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకున్న ప్రదీప్.. దీపావళికి ‘డ్యూడ్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాకు కూడా మంచి క్రేజే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రదీప్‌కు ఉన్న క్రేజే వేరు. తెలుగులో సైతం అతను మంచి ఫాలోయింగే తెచ్చుకున్నాడు.

ప్రదీప్ ఈ స్థాయికి చేరుకున్నా సరే.. చెన్నైలో అతడి తండ్రి సాధారణ జీవితమే గడుపుతున్నాడట. ఇంతకుముందు తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్నా జిరాక్స్ షాపును ఇప్పటికీ నడిపిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రదీపే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన తండ్రికి ఇప్పటికీ సింపుల్‌గా ఉండడమే ఇష్టమని.. అందుకే తాను ఒక కారు కొనిస్తానన్నా సరే తిరస్కరించాడని.. రోజూ బస్సులో ప్రయాణించి జిరాక్స్ షాపుకు వెళ్లి వస్తుంటాడని ప్రదీప్ తెలిపాడు. 

తాను చిన్నప్పట్నుంచి మంచి చదువరినని.. ఇంటర్మీడియట్లో 98 పర్సంట్ మార్కులు తెచ్చకున్నానని.. కానీ సినిమాల మీద ఆసక్తి ఉండడంతో తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టానని ప్రదీప్ తెలిపాడు. చదువును అశ్రద్ధ చేస్తున్నానని తన తల్లిదండ్రులు కొంత కంగారు పడ్డప్పటికీ.. ఇది కెరీర్ కాదని, కేవలం ఫన్ కోసం చేస్తున్నదే అని సర్ది చెబుతూ వచ్చానని ప్రదీప్ తెలిపాడు. జయం రవితో ‘కోమాలి’ తీశాకే తాను సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించానని ప్రదీప్ వెల్లడించాడు.