సింపతీ అంటే మాత్రం ఊరుకోను – యువ హీరో

త‌మిళ అనువాదాల‌కు తెలుగులో కావాల్సిన‌న్ని థియేట‌ర్లు ద‌క్కుతుండ‌గా.. తెలుగు చిత్రాల‌కు మాత్రం త‌మిళ‌నాట మినిమం స్క్రీన్లు కూడా ఇవ్వ‌రనే చ‌ర్చ ఈనాటిది కాదు. ఇదే విష‌య‌మై ఇటీవ‌ల టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక త‌మిళ క్రిటిక్‌తో ఇంట‌ర్వ్యూలోనే ప్ర‌స్తావించాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ సినిమా డ్యూడ్‌కు తెలుగులో బోలెడ‌న్ని స్క్రీన్లు ఇస్తుంటే.. త‌న సినిమా కే ర్యాంప్‌ను మాత్రం త‌మిళంలో రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదని. గ‌త ఏడాది క మూవీని రిలీజ్ చేద్దామంటే థియేట‌ర్లే దొర‌క‌లేద‌ని అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఐతే డ్యూడ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన తెలుగు నిర్మాత ర‌విశంక‌ర్.. కిర‌ణ్ వాద‌న‌ను కొట్టిపారేశారు. దీపావ‌ళి త‌మిళ చిత్రాల‌కు పెద్ద సీజ‌న్ అని.. ఆ టైంలో మ‌న సినిమాల‌కు స్క్రీన్లు దొర‌క‌వ‌ని అన్నారు. అంతే కాక‌ సినిమాలో కంటెంట్ ఉంటే త‌మ చిత్రం నుంచే షోలు ఇస్తామంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కొంద‌రు కిర‌ణ్ కామెంట్ల మీద నెగెటివ్‌గా స్పందించారు.

ఐతే తాను తెలుగు సినిమాకు మ‌ద్ద‌తుగా ఓ మంచి ప్ర‌శ్న వేసినా.. అవ‌స‌ర‌మైన విష‌యం గురించి మాట్లాడినా త‌న‌ను విమ‌ర్శించ‌డం ప‌ట్ల కిర‌ణ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు కిర‌ణ్‌. సినీ రంగానికి సంబంధించిన స‌మ‌స్య‌ల మీద మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలేమో అనిపిస్తోంద‌ని.. అలా అయితే ఇక‌పై మాట్లాడ్డం మానేస్తాన‌ని కిర‌ణ్ ఒక ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించాడు. తాను ఇండ‌స్ట్రీ మంచి కోస‌మే మాట్లాడాన‌ని.. కానీ దీని మీద కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తే, త‌ప్పుబ‌డితే ఎలా అని అత‌ను ప్ర‌శ్నించాడు.

త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కోసం మాట్లాడుతున్నానని.. సింప‌తీ కార్డ్ వాడుతున్నాన‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నార‌ని.. త‌న‌ను ఏమ‌న్నా ప‌డ‌తా కానీ.. సింప‌తీ అనే మాట వాడితే మాత్రం ఒప్పుకోన‌ని కిరణ్ అన్నాడు. తాను కేవ‌లం త‌న క‌ష్టాన్ని న‌మ్ముకుని ఇక్క‌డిదాకా వ‌చ్చాన‌ని.. ఎవ‌రినీ ఏ రోజూ ఏమీ అడ‌గ‌లేదని.. అలాంట‌పుడు సింప‌తీ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని ఎలా అంటార‌ని అత‌ను ప్ర‌శ్నించాడు. క మూవీ రిలీజ్ టైంలో త‌న త‌ల్లి క‌ష్టం గురించి చెప్పుకుంటే.. అప్పుడు కూడా సింప‌తీ కోసం ట్రై చేసిన‌ట్లు విమ‌ర్శించారని.. చాలామంది స్టేజ్ మీదే ఏడ్చార‌ని.. వాళ్లంద‌రినీ వ‌దిలేసి త‌న‌ను మాత్ర‌మే ఎందుకు టార్గెట్ చేస్తార‌ని కిర‌ణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.