బండ్ల గ‌ణేష్ వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డాం-బ‌న్నీ వాసు

ఎన్నో ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ సంస్థ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన బ‌న్నీ వాసు.. ఈ మ‌ధ్యే బ‌న్నీ వాసు వ‌ర్క్స్ పేరుతో కొత్త బేన‌ర్ పెట్టి సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ బేన‌ర్ నుంచి తొలి చిత్రంగా రిలీజ్ అయిన‌ లిటిల్ హార్ట్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. త్వ‌ర‌లోనే మిత్ర‌మండ‌లి సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు బ‌న్నీ వాసు. ఐతే లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌కు అతిథుల్లో ఒక‌రిగా హాజ‌రైన‌ బండ్ల గణేష్.. ఆ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజ‌రైన అల్లు అర‌వింద్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్య‌లు అప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఇండ‌స్ట్రీ అంతా మాఫియా అంటూ వ్యాఖ్యానించిన గ‌ణేష్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ నిన్ను ఎంక‌రేజ్ చేశాడు అనుకోవ‌ద్దు అన‌డం, అల్లు అర‌వింద్ చివ‌ర్లో వ‌చ్చి మొత్తం క్రెడిట్ తీసుకెళ్లిపోతాడ‌ని కామెంట్ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ కామెంట్ల‌తో అర‌వింద్ స‌హా అంద‌రూ కొంత ఇబ్బందిక‌రంగానే క‌నిపించారు. ఈ కామెంట్ల గురించి బ‌న్నీ వాసు తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో స్పందించాడు.

బండ్ల గ‌ణేష్ కామెంట్ల వ‌ల్ల ఆ రోజు ఈవెంట్లో అంద‌రూ బాగా ఇబ్బంది ప‌డిన‌ట్లు బ‌న్నీ వాసు తెలిపాడు. త‌న బేన‌ర్లో రిలీజైన తొలి సినిమా పెద్ద స‌క్సెస్ కావ‌డంతో ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నామ‌ని.. కానీ గ‌ణేష్ కామెంట్ల వ‌ల్ల మంచి వైబ్ దెబ్బ తింద‌ని బ‌న్నీ వాసు చెప్పాడు. ఆ కామెంట్ల మీద వెంట‌నే స్టేజ్ ఎక్కి మాట్లాడ‌దాం అనిపించింద‌ని, కానీ అలా స్పందించ‌డం క‌రెక్టా కాదా అన్న ఆలోచ‌న‌తో వెంటనే నిర్ణ‌యం తీసుకోలేక‌పోయాన‌ని వాసు తెలిపాడు. తాను ఏమైనా మాట్లాడితే.. అది కాస్తా వైర‌ల్ అయి వివాదం పెద్ద‌ద‌వుతుందేమో అనిపించింద‌న్నాడు. త‌ర్వాత అయినా బండ్ల గ‌ణేష్‌కు ఫోన్ చేసి మాట్లాడ‌దాం అనిపించింద‌ని.. కానీ త‌ర్వాత అది కూడా వ‌ద్దు అనుకుని సైలెంట్‌గా ఉండిపోయాన‌ని.. కానీ ఆ రోజు త‌న‌తో స‌హా అంద‌రం ఈవెంట్లో ఇబ్బంది ప‌డిన, డిస్ట‌ర్బ్ అయిన‌ మాట వాస్త‌వ‌మ‌ని బ‌న్నీ వాసు స్ప‌ష్టం చేశాడు.

ఇక మిత్ర‌మండ‌లి గురించి మాట్లాడుతూ.. ఇదొక పెద్ద‌ స్ట్రెస్ బ‌స్ట‌ర్ అని.. స్ట్రెస్ ఫీల‌వుతున్న వాళ్లు ఈ సినిమాకు వ‌స్తే రెండు గంట‌ల పాటు హాయిగా న‌వ్వుకోవ‌చ్చ‌ని బ‌న్నీ వాసు అన్నాడు.