ఒక సినిమాలో ముఖ్య పాత్రలను అనుకరిస్తూ ప్రేక్షకులు రీల్స్ చేసినా.. లేదా థియేటర్లలో ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసినా.. ఇంకో రకంగా సినిమా తమ మీద చూపిస్తున్న ప్రభావాన్ని బయట పెట్టినా.. ఆయా చిత్ర బృందాలు చాలా హ్యాపీగానే ఫీలవుతాయి. అది పబ్లిసిటీ పరంగా తమకు ప్లస్ అవుతాయనే ఫీలవుతాయి. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ సినిమా ప్రేక్షకులపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తోందో జనానికి చాటి చెప్పి పబ్లిసిటీ చేసుకుంటాయి. కానీ ‘కాంతార: చాప్టర్-1’ టీం మాత్రం దీనికి భిన్నంగా స్పందించి ప్రశంసలు అందుకుంటోంది.
‘కాంతార’ సినిమా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో పంజూరి అవతారం పూని హీరో చేసే విన్యాసాలే హైలైట్‌గా నిలిచాయి. ఆ సినిమా సక్సెస్ కావడంతో ‘కాంతార: చాప్టర్-1’ను ఇంకా భారీ స్థాయిలో రూపొందించారు. అది కూడా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.
ఐతే ‘కాంతార: చాప్టర్-1’ థియేటర్లలోకి పంజూరి అవతారంలోకి వస్తున్న అభిమానులు భూత కోలను పెర్ఫామ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ‘కాంతార: చాప్టర్-1’ ఏమీ హ్యాపీగా ఫీలవ్వలేదు. వాటిని ప్రమోట్ చేయలేదు. థియేటర్లలో ఇలాంటి విన్యాసాలు వద్దని విన్నవిస్తూ నోట్ రిలీజ్ చేసింది.
ఇది దైవభక్తి, మనోభావాలకు సంబంధించిన విషయమని.. ఆ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని.. ఇలాంటి వేషాలతో థియేటర్లకు వచ్చి ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయొద్దని కోరింది. ఈ వీడియోలను పబ్లిసిటీ కోసం వాడుకోకుండా.. దేవుడికి సంబంధించిన విషయాల్లో సంయమనం పాటించాలని పిలుపునివ్వడం మంచి విషయం. ఇది ‘కాంతార’ టీం సిన్సియారిటీకి నిదర్శనం అంటూ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్‌ను, హోంబలే అధినేతలను నెటిజన్లు కొనియాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates