లిటిల్ హార్ట్స్… ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో దీన్ని మించిన సెన్సేషన్ లేదనే చెప్పాలి. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా దాదాపు 40 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. థియేటర్లలో మూడు వారాల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిందీ చిత్రం. ఐతే ముందే జరిగిన డీల్ ప్రకారం నాలుగు వారాలకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఈటీవీ విన్‌లో రిలీజైన లిటిల్ హార్ట్స్ ఇక్కడా మంచి స్పందనే తెచ్చుకుంటోంది. ఈ సినిమా థియేటర్లలో ఉన్నన్ని రోజులు భలేగా ప్రమోట్ చేసింది చిత్ర బృందం. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ టీం అంతా కలిసి మరో సినిమా ప్రమోషన్‌కు వచ్చింది. ఆ చిత్రమే.. మిత్ర మండలి. లిటిల్ హార్ట్స్‌ను మించి సరదాగా సాగేలా కనిపిస్తోంది ఈ చిత్రం. ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్‌లో సాగింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు.. లిటిల్ హార్ట్స్ టీంకు భలే ఎలివేషన్ ఇచ్చాడు.
మిత్రమండలి సినిమాతో సొంతంగా ప్రొడక్షన్లోకి అడుగు పెట్టిన బన్నీ వాసు.. అంతకంటే ముందు లిటిల్ హార్ట్స్ మూవీని తన బేనర్ మీద రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు. ట్రైలర్లో కూడా లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ వాసు నుంచి వస్తున్న సినిమా అని వేశారు కూడా. మిత్రమండలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బన్నీ వాసు లిటిల్ హార్ట్స్ టీం మూడు నెలల ముందు తన దగ్గరికి వచ్చి తమ సినిమాను రిలీజ్ చేయమని అడిగిందని.. అలాంటిది ఇప్పుడు తన సినిమా ట్రైలర్ లాంచ్‌కు అతిథులుగా రావాలని తానే లిటిల్ హార్ట్స్ టీంను అడిగానని.. ఇది కదా సక్సెస్ అంటే అని బన్నీ వాసు అన్నాడు.
మూడు నెలల్లో వీళ్లందరి జీవితాల్లో ఇంత గొప్ప మార్పు వచ్చిందని.. ఇదంతా ఒక్క మంచి సినిమాతో సాధ్యం అయిందని.. ఇక ముందు కూడా లిటిల్ హార్ట్స్ టీం సభ్యులు అందరూ ఇలాంటి విజయాలతోనే దూసుకెళ్లాలని.. అందులో తనతోనూ కొన్ని సక్సెస్‌లు ఇవ్వాలని బన్నీ వాసు పేర్కొన్నాడు. మిత్రమండలి కూడా లిటిల్ హార్ట్స్ లాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని.. ఇది కూడా పెద్ద హిట్టవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు బన్నీ వాసు.
Gulte Telugu Telugu Political and Movie News Updates