ఓజీ… ఈ ప‌నేదో కొంచం ముందే చేసి ఉంటే

అధిక టికెట్ల ధ‌ర‌లు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు దూరం చేస్తాయ‌ని.. టికెట్ల రేట్లు అందుబాటులో ఉంటే మరింత‌మంది జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువ‌వుతున్నా స‌రే.. మ‌న ఇండ‌స్ట్రీ జ‌నాలు మాత్రం పాఠాలు నేర్వ‌డం లేదు. మ‌హావ‌తార న‌ర‌సింహా, మిరాయ్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాల‌కు అంచ‌నాల‌కు మించి ఫుట్ ఫాల్స్ వ‌చ్చాయి అంటే.. అందుక్కార‌ణం వాటి టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉండ‌డ‌మే. అందువ‌ల్లే వాటికి కొన్ని వారాల పాటు మంచి ఆక్యుపెన్సీలు వ‌చ్చాయి. కానీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను క‌నుక నార్మ‌ల్ రేట్ల‌తో రిలీజ్ చేసి ఉంటే.. క‌చ్చితంగా ఎక్కువ‌మంది జ‌నం చూసేవాళ్లు, సినిమాకు అంతిమంగా ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చేవ‌న్న‌ది స్ప‌ష్టం.

దీని త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి వ‌చ్చిన కొత్త సినిమా ఓజీకి కూడా భారీగా రేట్లు పెంచారు. ఐతే వీకెండ్లో అభిమానులు సినిమాను ఎగ‌బ‌డి చూస్తారు కాబ‌ట్టి.. అప్ప‌టి వ‌ర‌కు అద‌న‌పు రేట్లు ఉన్నా ఓకే అనుకోవ‌చ్చు. కానీ వీకెండ్ అయ్యాక ఎంత మంచి సినిమా అయినా నిల‌బ‌డాలి అంటే టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి.

కానీ ఏపీలో శ‌నివారం వ‌ర‌కు ఎక్స్‌ట్రా రేట్ల‌తోనే న‌డిపించారు. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట‌ర్లు సొంతంగా రేట్లు త‌గ్గించుకున్నారే త‌ప్ప ఓవ‌రాల్‌గా రేట్లు త‌గ్గ‌లేదు. తెలంగాణ‌లో కోర్టు ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం నుంచి రేట్లు త‌గ్గించ‌డం మంచిదైంది. అంతే త‌ప్ప నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ చొర‌వ తీసుకోలేదేదు. ఆదివారం నాడు ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఆక్యుపెన్సీలు వ‌చ్చాయి. ఈవెనింగ్, నైట్ షోల‌కు హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి.

అందులో టికెట్ల రేట్ల పాత్ర కీల‌కం అన‌డంలో సందేహం లేదు. ప‌వన్ క‌ళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే న్యూట్ర‌ల్ ఆడియ‌న్స్, కుటుంబ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు బాగా వ‌స్తారు. కానీ అధిక రేట్లు ఉంటే వాళ్లు వెన‌క్కి త‌గ్గుతారు. సోమ‌వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు త‌గ్గించి ఉంటే క‌చ్చితంగా ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు ఉండేవి. ఓజీ అనుభ‌వం నుంచి అయినా ఇండ‌స్ట్రీ పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పెద్ద సినిమాల‌కు రేట్లు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉన్నా స‌రే, తొలి వీకెండ్ త‌ర్వాత మాత్రం నార్మ‌ల్ రేట్ల‌కు వ‌చ్చేయ‌డం చాలా బెట‌ర్.