హ్యాపీ ఆదివారం… ఇండస్ట్రీలో సంతోషం

సెప్టెంబర్ లో నాలుగు సినిమాలు లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురి, ఓజి టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. క్రమం తప్పకుండా థియేటర్లలు మంచి ఆక్యుపెన్సీలు చూసేందుకు ఇవి దోహదం చేశాయి. తాజాగా అక్టోబర్ కూడా అదే తరహాలో బోణీ చేయడంతో బయ్యర్ వర్గాల ఆనందం అంతా ఇంతా కాదు. ఓజికి ఇవాళ్టి నుంచి ఏపీలో సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి రావడంతో రిపీట్ చూడాలనుకున్న ఫ్యాన్స్ తో పాటు థియేటర్ వాచ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులతో హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పదకొండో రోజు ఇది మంచి సంకేతం.

ఇక కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ గురించి చెప్పనక్కర్లేదు. చాలా చోట్ల డిమాండ్ కు తగ్గ షోలు లేక వెనక్కు వెళ్తున్న ఆడియన్స్ సంఖ్య భారీగా ఉంది. ముఖ్యంగా థియేటర్లు తక్కువగా ఉండే కింది స్థాయి కేంద్రాల్లో ఇది మరింత తీవ్రంగా మారింది. ఇడ్లి కొట్టు, సన్నీ సంస్కారి కి తులసి కుమారిలను రీ ప్లేస్ చేసిన మరీ కాంతారకు ఇస్తున్నా సరిపోవడం లేదు. ఓజి రెండో వారం అగ్రిమెంట్లతో పాటు పాజిటివ్ టాక్ కొనసాగుతుండటంతో దాన్ని తీసేయడానికి ఛాన్స్ లేకపోయింది. అయినా సరే వీలైనన్ని ఎక్కువ షోలు కాంతారాకు పడేలా ప్రయత్నాలు చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు సండే భారీ రెవిన్యూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

విచిత్రంగా ఓటిటి రిలీజ్ దగ్గరగా ఉన్న మిరాయ్ సైతం తక్కువ షోలు ఉన్నా సరే ఇంకా ఆడియన్స్ ని రప్పించగలుగుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేలకు పైగా టికెట్లు అమ్మడం మాములు విషయం కాదు. ఇరవై రోజుల తర్వాత ఇంత స్టడీగా ఉండటం చాలా అరుదు. లిటిల్ హార్ట్స్ అక్కడక్కడా మాత్రమే అందుబాటులో ఉన్నా కుర్రకారు మద్దతు కొనసాగుతోంది. మొత్తానికి ఇలా థియేటర్లు వారాల తరబడీ కళకళలాడటం చూసి నెలలు గడిచిపోయిందని, థియేటర్ యాజమాన్యాలు హ్యాపీగా ఉండటం ఈ మధ్యే చూస్తున్నామని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కామెంట్ చేయడం విశేషం. ఇదే కొనసాగాలి.