లిటిల్ హార్ట్స్… ఓవ‌ర్ రేటెడా?

కొన్ని చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో విజ‌యం సాధిస్తుంటాయి. పెద్ద సినిమాల‌తో త‌ల‌ప‌డి వ‌సూళ్ల పంట పండిస్తుంటాయి. ఆరంభ ద‌శ‌లో ట్రేడ్ పండిట్ల అంచ‌నాల‌ను కూడా మించిపోయి బెంచ్ మార్క్ సెట్ చేస్తుంటాయి. అలాంటి సినిమాలు థియేట్రిక‌ల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి వ‌చ్చిన‌పుడు.. దీని కోస‌మా జ‌నం అంత ఎగబ‌డి చూసింది అంటూ డిజిట‌ల్ ఆడియ‌న్స్ పెద‌వి విరుస్తుంటారు. ఓవ‌ర్ రేటెడ్ అంటూ ఒక ముద్ర వేసి అలాంటి చిత్రాల మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు.

ఈ ఏడాది మార్చిలో రిలీజై పెద్ద హిట్ట‌యిన కోర్టు మూవీ గురించి కూడా ఇలాంటి కామెంట్లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ లిటిల్ హార్ట్స్ విష‌యంలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందా అని అంద‌రూ ఎదురు చూశారు. థియేట‌ర్ల‌లో బాగా ఆడుతుండ‌గానే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తెచ్చేశారు.

సెప్టెంబ‌రు 5న థియేటర్ల‌లో రిలీజైన ఈ చిత్రం స‌రిగ్గా నాలుగు వారాల‌కు డిజిట‌ల్‌గా రిలీజైంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగ‌మైన ఈటీవీ విన్ సంస్థ దీన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఐతే లిటిల్ హార్ట్స్‌కు ఓటీటీలో కూడా గొప్ప స్పంద‌నే వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఓవ‌ర్ రేటెడ్ అంటున్న వాళ్లు త‌క్కువ‌. అలాంటి కామెంట్లు కూడా ఉన్న‌ప్ప‌టికీ.. అవి త‌క్కువే. ఎక్కువ‌మంది ఓటీటీలోనూ ఈ సినిమాను కొనియాడుతున్నారు. కామెడీ, రొమాన్స్‌తో పాటు ప‌తాక స‌న్నివేశాల‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

బెంగ‌ళూరు నేప‌థ్యంలో వ‌చ్చే పాట‌కు చాలామంది క‌నెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాకు అదే మేజ‌ర్ హైలైట్ అంటున్నారు. మౌళి, శివాని న‌గ‌రంతో పాటు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన అంద‌రు న‌టుల పెర్ఫామెన్స్‌కు, సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు, డైలాగులకు, సింజిత్ మ్యూజిక్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. డిజిట‌ల్‌గా రిలీజై నాలుగు రోజులు తిర‌క్క‌ముందే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును అందుకుందంటే లిటిల్ హార్ట్స్ ఆన్ లైన్లోనూ ఎంత మంచి స్పంద‌న తెచ్చుకుంటోందో అర్థం చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి థియేట‌ర్ల‌లోనే కాదు.. ఓటీటీలోనూ ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అనే చెప్పాలి.