చిన్న సినిమా నిర్మాత క‌న్నీళ్లు

ఈ రోజుల్లో చిన్న సినిమా నిర్మించ‌డం.. దాన్ని స‌రిగ్గా రిలీజ్ చేయ‌డం.. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించి విజ‌యం సాధించ‌డం పెద్ద స‌వాలుగా మారిపోయింది. లిటిల్ హార్ట్స్ లాంటి మ్యాజిక్‌లు ఎప్పుడో కానీ జ‌ర‌గ‌వు. చాలా వ‌ర‌కు సినిమాలు మేకింగ్ ద‌శ‌లో, ఆ త‌ర్వాత‌ రిలీజ్ కోసం ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని స‌క్సెస్ చేయ‌డం మ‌రింత పెద్ద స‌వాలు. ఇండ‌స్ట్రీలో చిన్న సినిమాల మేక‌ర్స్‌కు ప‌రిస్థితులు ఎంత క‌ఠినంగా మారుతున్నాయో అహితేజ బెల్లంకొండ అనే యువ నిర్మాత త‌న సినిమా శ‌శివ‌ద‌నేకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఆవేద‌నాభ‌రిత స్వ‌రంతో చెప్పాడు.

పెద్ద ఉద్యోగం చేసుకుంటూ మంచి స్థాయిలో ఉన్న తాను ఎంతో ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాన‌ని.. మెగా ఫ్యాన్ అనే గుర్తింపుతో ఎన్నో సినిమాల ప‌బ్లిసిటీ, నిర్మాణ వ్య‌వ‌హారాల్లో భాగం అయ్యాన‌ని.. కానీ త‌న సినిమాకు వ‌చ్చేస‌రికి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాన‌ని అహితేజ చెప్పుకొచ్చాడు.
ఫిలిం ఇండ‌స్ట్రీలో మీటింగ్స్ అన్నీ కూడా త‌మ సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌లు పెంచుకోవ‌డం మీదే జ‌రుగుతాయ‌ని.. అంతే త‌ప్ప ఇండ‌స్ట్రీ మంచి కోసం, ముఖ్యంగా చిన్న సినిమాల‌ను ఆదుకోవ‌డం మీద అస్స‌లు జ‌ర‌గ‌వ‌ని అహితేజ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.

బ్యాగ్రౌండ్ లేకపోతే ఇక్క‌డ మ‌నుగడ సాగించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. తాను ఎంత ట్రై చేసినా శ‌శివ‌ద‌నే సినిమా ట్రైల‌ర్ లాంచ్ కోసం సెల‌బ్రెటీలు ఎవ‌రినీ ఒప్పించ‌లేక‌పోయాన‌ని.. ఎవ్వ‌రూ స్పందించ‌లేద‌ని అహితేజ విచారం వ్య‌క్తం చేశాడు. ఐతే త‌న‌కు మొద‌ట్నుంచి మీడియా, సోష‌ల్ మీడియానే అండ‌గా నిలుస్తోంద‌ని.. వాళ్ల‌ను న‌మ్మే ట్రైల‌ర్‌ను లాంచ్ చేశామ‌ని.. అది ఒక మిలియ‌న్‌కు పైగా వ్యూస్ తెచ్చుకుంద‌ని.. అందులో 20 శాతం మంది థియేట‌ర్ల‌కు వ‌చ్చినా త‌మ సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని అహితేజ చెప్పాడు.

ఈ సినిమా నిర్మాణ స‌మ‌యంలో చాలా క‌ష్టాలు ప‌డ్డామ‌ని.. పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఆల‌స్యం అయింద‌ని అత‌ను తెలిపాడు. సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్సుల‌న్నీ చివ‌ర్లో తీసుకుందామ‌నుకున్నామ‌ని.. కానీ అవి తీయాల్సిన స‌మ‌యానికి స‌మ్మె వ‌చ్చింద‌ని.. స‌మ్మె త‌ర్వాత చిన్న సినిమాల‌కు 10 శాతం జీతాల పెంపుతో నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. కానీ త‌మ సినిమాకు ప‌ని చేయాల్సిన కార్మికులు మాత్రం 30 శాతం పెంపు డిమాండ్ చేశార‌ని.. దీని గురించి చాంబ‌ర్ వాళ్ల‌కు ఫోన్ చేస్తే స‌రిగా స్పందించ‌లేద‌ని.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వ‌చ్చేయ‌మ‌న్నార‌ని.. కానీ షూటింగ్ కోసం ఎంతో ఖ‌ర్చు పెట్టుకుని వెళ్లాక తిరిగి రావ‌డం ఎలా సాధ్య‌మ‌ని.. అందుకే హీరో, అత‌డి తండ్రితో క‌లిసి ఇష్యూను సెటిల్ చేసుకుని షూటింగ్ చేసుకుని వ‌చ్చామ‌ని చెబుతూ అహితేజ తీవ్ర భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ర‌క్షిత్ శెట్టి, కోమ‌లి ప్ర‌సాద్ జంట‌గా సాయిమోహ‌న్ ఉబ్బ‌న రూపొందించిన శ‌శివ‌ద‌నే ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.