ఇడ్లీలు రుచిగా ఉన్నాయా లేవా

పెద్దగా అంచనాలు లేకుండా ఇడ్లి కొట్టు సైలెంట్ గా విడుదలైపోయింది. తెలుగులో కుబేర లాంటి స్ట్రెయిట్ హిట్టు కొట్టాక కూడా ధనుష్ మూవీకి ఎలాంటి సందడి కనిపించకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇక్కడ కూడా తనకు ఫాలోయింగ్ ఉంది. అయితే తమిళంలోనూ దీనికి భీభత్సమైన బజ్ లేదు. కాకపోతే ఉన్నంతలో బుకింగ్స్ డీసెంట్ గా ఉండి ట్రెండింగ్ లో కనిపించాయి కానీ రాయన్ రేంజ్ లో అయితే కాదు. ధనుష్ దీని ప్రమోషన్ల కోసం చాలా కష్టపడ్డాడు. నిర్మాత, దర్శకుడు, హీరో ఇలా మొత్తం మూడు బాధ్యతలతో పాటు మార్కెటింగ్ కూడా భుజాన వేసుకుని తమిళనాడు మొత్తం తిరిగాడు.

ఇంతా చేసి ఇడ్లి కొట్టు రిపోర్ట్స్ ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. నిజానికి దీని కథ మొత్తం ధనుష్ ట్రైలర్ లోనే చెప్పేశాడు. స్క్రీన్ మీద కూడా అదే ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న హీరో స్వగ్రామంలో తండ్రి చనిపోయాడని తెలిసి ఇంటికి వస్తాడు. ఆ మరుసటి రోజే దిగులుతో తల్లి కూడా చివరి శ్వాస తీసుకుంటుంది. వాళ్లిదరు ప్రాణంగా చూసుకునే ఇడ్లి కొట్టుని తిరిగి నడిపించాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా ఫారిన్ కంపెనీ ఓనర్, అతని కొడుకు వచ్చి నానా రాద్ధాంతం చేస్తారు. ఎందుకు ఏమిటి అనేదే అసలు స్టోరీ. లైన్ పరంగా బాగానే ఉంది కానీ రెండున్నర గంటల కంటెంట్ కాదిది.

ఎమోషన్లు చాలా బరువుగా ఉండటం, సెంటిమెంట్ ఎక్కువగా దట్టించడం, భావోద్వేగాల కోసం సీన్లను బాగా ల్యాగ్ చేయడం లాంటి కంప్లైంట్స్ ఇడ్లి కొట్టు గురించి వినిపించాయి. సార్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన జివి ప్రకాష్ కుమార్ ఈసారి చేతులు ఎత్తేశాడు. అంత గొప్ప సందర్భాలు కూడా రాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతే. అయితే ధనుష్, నిత్య మీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ పెర్ఫార్మన్స్ మరీ బ్యాడ్ వాచ్ కాకుండా కాపాడాయి. టన్నుల్లో ఓపిక ఉన్నా భరించడం కష్టమే అనిపించేలా ఉన్న ఇడ్లి కొట్టు ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ముందు నిలవడం పెద్ద సవాల్ గా కనిపిస్తోంది.