నాగార్జున బాటలో అందరూ ప్రయాణిస్తే

ఇకపై నాగార్జున అనుమతి లేకుండా ఆయన ఫోటో, వాయిస్, పేరు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నాగ్ కు రెగ్యులర్ మీడియాతో ఎలాంటి సమస్య లేదు. కానీ యూట్యూబ్ లో కొందరు ఆయన బ్రాండ్, ఇమేజెస్ ని వాడుకుని కించపరిచేలా వీడియోలు రీల్స్ చేస్తుండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇకపై ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా నాగార్జునని వాడుకుంటే తదుపరి చర్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఆయన దృష్టికి వచ్చాక కూడా మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకోవచ్చు. లేదంటే చిక్కే.

సరే ట్రోలింగ్ బ్యాచులను కట్టడి చేయడానికి ఇలాంటి నియంత్రణ అవసరమే. ఈ మధ్యే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఇదే తరహాలో కోర్టు నుంచి రక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఒక తెలంగాణ మంత్రి నాగార్జున పేరుని అనుచితంగా వాడి వివాదాన్ని సృష్టించడం నుంచే ఈ ఆలోచన మొదలైందని అన్నపూర్ణ వర్గాలు అంటున్నాయి. కేవలం సినిమాలే కాక బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలు చేస్తున్న నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ లాంటి సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా మిస్ యూజ్ చేయడంతో ఈ సమస్య వచ్చింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ దీన్ని మిగిలిన వాళ్ళు ఫాలో అయితే.

అదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. సినిమాల వీడియోలు కాపీ రైట్స్ ప్రకారం ఇల్లీగల్ గా వాడుకోవడం తప్పు. కానీ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు ప్రతిసారి అనుమతులు తీసుకుని వాడుకోవడం కుదరని పని. అదే జరిగితే అటు స్టార్లకు కూడా పబ్లిసిటీ తగ్గిపోతుంది. న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేవలం తన ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేసే వాళ్లను అడ్డుకోవడానికి నాగార్జున లాంటి హీరోలు కేసులు వేశారు తప్పించి ప్రతి చిన్న దానికి పర్మిషన్ అడగడానికి కాదట. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వాడి వీడియోలు సృష్టిస్తున్న వాళ్లకు ఇలాంటి షాకులు ఇవ్వక తప్పదు.