బన్నీ సినిమా లెవెలే వేరు

ఒకప్పుడు దక్షిణాది చిత్రాల కోసం విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పిస్తే దాన్ని గొప్ప విషయంగా చూసేవాళ్లు. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం విదేశీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకునేవారు. కానీ తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్లను అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదుగుతుండడంతో దాదాపుగా అన్ని విభాగాల నుంచి టెక్నీషియన్లను విదేశాల నుంచి రప్పిస్తున్నారు. ‘రామాయణం’ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడైన హన్స్ జిమ్మర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. 

విదేశీ స్టంట్ మాస్టర్లు పని చేస్తున్న సినిమాలు ఇండియాలో ప్రస్తుతం చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రముఖ అంతర్జాతీయ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. ఓ దక్షిణాది సినిమాకు పని చేస్తుండడం విశేషం. ఆ చిత్రమే.. అల్లు అర్జున్ 22.  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం  జపనీస్-బ్రిటిష్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషిని తీసుకున్నారు. అతను ఆల్రెడీ ముంబయిలో అడుగు పెట్టేశాడు. బన్నీ, అట్లీ కొనిషితో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. 

విచిత్రమైన అవతారంతో కనిపించే కొనిషికి పలు దేశాల్లో అభిమానులున్నారు. బన్నీ-అట్లీ సినిమాలో ఒక పాటను అతను కంపోజ్ చేస్తున్నాడు. కేవలం ఒక పాట కోసం ఇలా విదేశీ కొరియోగ్రాఫర్‌ను తీసుకోవడం అంటే బన్నీ సినిమా లెవెల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కోసం కెచా మాస్టర్‌ను తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాడు బన్నీ. ఇండియాలో టాప్ డ్యాన్సర్లలో ఒకడైన బన్నీతో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ పని చేస్తుండడంతో స్టెప్పులు అదిరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.