బూతుల సమర్ధింపుల్లో లాజిక్ ఉంది కానీ

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కె ర్యాంప్ వచ్చే నెల విడుదల కానుంది. ఇప్పటి దాకా వచ్చిన రెండు టీజర్లలో బూతులు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్స్ బలంగా వినిపించాయి. నేరుగా డబుల్ మీనింగులు వాడకపోయినా స్పష్టంగా అవి వేటి గురించో స్ఫూరణకు వచ్చేలా రాసుకున్న వైనం అందరూ గుర్తు పట్టేశారు. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన కె ర్యాంప్ బృందానికి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కిరణ్ తో పాటు సీనియర్ నటుడు నరేష్, నిర్మాత రాజేష్ దండా తమవైపు వర్షన్లు వినిపించే ప్రయత్నం చేసి సమర్ధించుకున్నారు. ఫైనల్ వెర్షన్ లో మీకు అలాంటివి వినిపించవనే రీతిలో హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నరేష్ ఒక ఉదాహరణ చెప్పారు. లిటిల్ హార్ట్స్ లో ఒక సీన్ లో తగులుతుంది అనే డైలాగులో బూతు ఉందని, అయినా సెన్సార్ అప్రూవ్ చేసిందని అన్నారు. ఇదే పేరుని కిరణ్ నేరుగా అనలేదు కానీ ఇటీవలే ఒక సినిమాని థియేటర్ లో చూశానని, బూతులు జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని, నవ్వుతున్నారని అన్నాడు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత మేర నిజముంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మౌళి అనే కొత్త కుర్రాడికి ఎలాంటి ఇమేజ్ లేదు కాబట్టే దర్శకుడు కాస్త స్వేచ్ఛ తీసుకున్నాడు. వాటిని ప్రేక్షకులు అంగీకరించి ఆదరించారు. అయినా సరే ద్వందార్థాలు విపరీతంగా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ రాలేదు.

కానీ కిరణ్ అబ్బవరం కేసు వేరు. తనకు ఇమేజ్, మార్కెట్, బిజినెస్ రేంజ్ అన్నీ ఉన్నాయి. గత ఏడాది అమరన్, లక్కీ భాస్కర్ తో పోటీపడి మరీ క తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో అసలు లిటిల్ హార్ట్స్ తో పోలికే అనవసరం. బూతులు పెట్టడం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. ముప్పై నలభై క్రితమే ఎన్నో యూత్ ఫుల్ సినిమాల్లో వాటిని పెట్టారు. కాబట్టి ఇదేదో కె ర్యాంప్ తో మొదలయ్యే ట్రెండ్ కాదు. అయినా సరే సినిమా చూసి క్యారెక్టరైజేషన్లు చూశాక ఒక అభిప్రాయానికి రమ్మని చెబుతున్నారు కాబట్టి అదేదో థియేటర్లోనే డిసైడ్ అవ్వాలి. ఇంకో ఇరవై రోజులే టైం ఉండటంతో కె ర్యాంప్ పబ్లిసిటీని వేగవంతం చేయబోతున్నారు.