తెలుగు సినిమాల్లో సంగీతం పరంగా ఎన్నో ఏళ్ల నుంచి దేవిశ్రీ ప్రసాద్, తమన్‌ల మధ్య పోటీ నడుస్తూ వచ్చింది. చాలా ఏళ్లు దేవిదే ఆధిపత్యం.. ఆ తర్వాత దేవి కొంచెం డౌన్ అయి తమన్ ఆధిపత్యం పెరిగింది. కానీ అదే సమయంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రైజ్ అయి.. అతడి నుంచి తమన్‌కు పోటీ తప్పలేదు. తమిళంలో తిరుగులేని స్థాయికి చేరుకున్న అనిరుధ్.. కొన్ని తెలుగు సినిమాలతోనూ తమన్‌కు సవాలు విసిరాడు. గత కొన్నేళ్లలో ‘జైలర్’ సహా కొన్ని చిత్రాలకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ స్టాండౌట్‌గా నిలిచింది.
పెద్ద స్టార్లు నటించే మాస్సి నిమాలకు ఉర్రూతలూగించేలా పాటలు, బీజీఎం ఇవ్వడంలో అనిరుధ్ తర్వాతే ఎవ్వరైనా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ టైంలో తమన్ కొంత హర్టయినట్లే కనిపించాడు. ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ పేరెత్తకుండా లియో, జైలర్ లాంటి తన సినిమాల పేర్లు ప్రస్తావించి.. వాటన్నింటికీ తన ‘ఓజీ’ సమాధానంగా నిలుస్తుంది అంటూ అతను సవాలు విసిరాడు.
తమన్ ‘ఓజీ’ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో, దీనికి ఏ స్థాయిలో డ్యూటీ చేశాడో ఇప్పుడు సినిమా చూస్తున్న వారికి అర్థమవుతోంది. ఈ సినిమా కోసం ది బెస్ట్ ఇచ్చిన వాళ్లలో ముందు చెప్పుకోవాల్సిన పేరు.. తమన్‌దే. పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్, సుజీత్ దర్శకత్వం గురించి అయినా ఏమైనా వేలెత్తి చూపించవచ్చేమో కానీ.. తమన్ మ్యూజిక్ గురించి ఒక్క మాట అనడానికి వీల్లేదు. సినిమా మొదలైన తొలి క్షణం నుంచి తమన్ బీజీఎం మామూలుగా లేదు.
తెర మీద అద్భుతంగా పండిన ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సుల వెనుక తమన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలు సీన్లను కూడా తన బీజీఎంతో వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇంతకుముందు తమన్ బీజీఎం విషయంలో విజృంభించింది ‘అఖండ’ విషయంలో. ఇప్పుడు ‘ఓజీ’ చూస్తే దాన్ని మించే ఔట్ పుట్ ఇచ్చాడని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తమన్‌కు గుడి కట్టేయొచ్చు అంటూ అతణ్ని కొనియాడుతున్నారు. ప్రామిస్ చేశాడు, నిలబెట్టుకున్నాడు అంటూ అతడి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates