ప్రీమియర్ డే – అందరి చూపు అక్కడే

ఇవాళ రాత్రి పది గంటల నుంచి ఓజి ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. కేవలం కటవుట్ లాంచులకే ఓ రేంజ్ హడావిడి చేస్తున్న అభిమానులు ఇంక థియేటర్లలో తమ ఎగ్జైట్ మెంట్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటారో అంతు చిక్కడం లేదు. థియేటర్ యజమానులు ఇప్పటికే భద్రత పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు. అధికారికంగా టికెట్ ధర వెయ్యి రూపాయలైనా సరే దొరకని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సింగల్ స్క్రీన్లలో మూడు నుంచి అయిదు వేల రూపాయలకు అమ్ముతున్నా దొరకడం లేదని అభిమానులు వాపోతున్నారు. ఏపీ తెలంగాణ మొత్తంపాజిటివ్ వైబ్ తో కూడిన ఓజి వాతావరణమే కనిపిస్తోంది.

ప్రీమియర్లతో కలుపుకుని ఓపెనింగ్ డే సులభంగా వంద కోట్లు దాటేస్తుందని బయ్యర్ల అంచనా. అదేమీ అసాధ్యంగా కనిపించడం లేదు. ఓవర్సీస్ కి డ్రైవ్స్ పంపడం ఆలస్యమైనా సరే యుఎస్ లో ఉన్న ఫ్యాన్స్ సహాయంతో వాటిని థియేటర్లకు, మల్టీప్లెక్సులకు చేరవేసే విధంగా చేసుకున్న ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఎక్కడా షోలు రద్దు కావడం ఉండదని డిస్ట్రిబ్యూటర్ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రతి సెంటర్ లోనూ పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను లక్ష్యంగా పెట్టుకున్న ఓజి దాన్ని చేరుకోవడం ఇవాళ అర్ధరాత్రి వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంటుంది. రివ్యూలు కూడా త్వరగానే ప్రత్యక్షం కాబోతున్నాయి.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దసరా దాకా ఓజి ఆడబోయే విధ్వంసం మాములుగా ఉండదు. ఇప్పటికీ రన్ లోనే ఉన్న మిరాయ్, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ లాంటివి సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 కాంతారా వచ్చే దాకా ఎలాంటి బ్రేకులు పడవు. అయితే టికెట్ రేట్ల పెంపు ఓజికి అప్పటిదాకా అమలులో ఉంటుంది కనక సాధారణ రేట్ల కోసం ఎదురు చూస్తున్న మాస్ ఆడియన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం థియేటర్లకు వస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు సగటు మూవీ లవర్స్ కు కూడా శివరాత్రి కానుంది. అప్డేట్స్, టాక్స్, సెలబ్రేషన్ వీడియోస్ తో ఆన్ లైన్ హోరెత్తిపోనుంది.