‘అ!’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా.. కమర్షియల్‌గా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత అతను తీసిన ‘కల్కి’ నిరాశపరిచింది. ‘జాంబి రెడ్డి’ ఓ మాదిరిగా ఆడింది. ఐతే ప్రశాంత్ నాలుగో చిత్రం ‘హనుమాన్’ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రశాంత్ మీద అంచనాలు పెరిగిపోయాయి. పెద్ద స్టార్లలోనూ తనతో సినిమా చేయాలన్న ఆసక్తి కనిపించింది. ఏకంగా ప్రభాస్ సైతం సినిమా చేయడానికి అంగీకరించాడు.
ఐతే ఈ కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందన్నదే క్లారిటీ లేదు. ఈలోపు ప్రశాంత్ ఒకదాని తర్వాత ఒకటి సినిమా అనౌన్స్ చేస్తున్నాడు. కానీ అవి ముందుకు మాత్రం కదలడం లేదు. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో ‘బ్రహ్మ రాక్షస్’ అనే సినిమా తీయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రి విజువలైజేషన్ షూట్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. మరోవైపు ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను ప్రకటించి చాలా కాలమైంది. కానీ తర్వాత అప్‌డేట్ లేదు.
ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రిషబ్ శెట్టి ఏమో వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్యలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు, అది తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగమన్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. కానీ ఆ సినిమా ఏవో కారణాలతో ముందుకు కదల్లేదు. తర్వాత ప్రభాస్ సినిమా తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు కూడా స్క్రిప్టు రెడీగా ఉంది కానీ.. ప్రభాస్ అందుబాటులోకి రావడంపైనే ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తేలుతుందని చెప్పాడు ప్రశాంత్.
ఇప్పుడేమో పీవీసీయూ నుంచి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అధీర పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఇందులో విలన్‌గా ఎస్.జె.సూర్యను కన్ఫమ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బాగానే అనిపిస్తోంది. దీనికి ప్రశాంత్ స్క్రిప్టు అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఐతే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చూసి సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇలా అనౌన్స్‌మెంట్లు ఇవ్వడమేనా.. సినిమాలు తీసేదేమైనా ఉందా? ఈ చిత్రమైనా వెంటనే సెట్స్ మీదికి వెళ్తుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ప్రశాంత్ షూటింగ్ మొదలుపెట్టించి సమాధానం ఇస్తాడా?
Gulte Telugu Telugu Political and Movie News Updates