సెప్టెంబరు నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ డ్రీమ్ రన్ చూస్తోంది. తొలి వారంలో వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకెళ్లింది. పది కోట్లు, ఇరవై కోట్లు, ముప్పై కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఇక తర్వాతి వారం రిలీజైన మిరాయ్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేసింది. కిష్కింధపురి సైతం మంచి వసూళ్లతో సాగింది. ఇలా సెప్టెంబరు ప్రథమార్ధంలో థియేటర్లు జనాలతో కళకళలాడిపోయాయి. చివరి వారంలో ఎలాగూ ఓజీ సందడి ఉండనే ఉంది. మరి మధ్యలో మిగిలిన ఒక్క వీకెండ్లోనూ బాక్సాఫీస్‌కు కలిసిస్తుందా అని చూశారు సినీ జనాలు.
కానీ ఈ వీకెండ్లో వచ్చిన కొత్త సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఈ వారం రిలీజైన నాలుగు సినిమాల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బ్యూటీ మూవీనే. మారుతి సమర్పణలో ఒక యంగ్ టీం ఈ సినిమా చేసింది. ఇప్పటిదాకా క్యారెక్టర్ రోల్స్ చేసిన అంకిత్ కోయ ఈ సినిమాతో హీరోగా మారాడు. ఒడియా అమ్మాయి నీలాఖి పాత్ర హీరోయిన్. వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రిమియర్స్ వేసి కొంత హడావుడి చేశారు కానీ.. రిలీజ్ రోజు అంత గొప్ప టాకేమీ రాలేదు. బిలో యావరేజ్ కంటెంట్‌తో సినిమా పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. వసూళ్లు పర్వాలేదు. కానీ వీకెండ్లోనే తడబడుతున్న ఈ సినిమా.. తర్వాత నిలిచే అవకాశాలు కనిపించడడం లేదు.
ఇక మంచు లక్ష్మీప్రసన్న లాంగ్ డిలేయ్డ్ మూవీ దక్ష నామమాత్రంగా రిలీజైంది. మోహన్ బాబు కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి హైప్ లేదు. టాక్ కూడా బాలేదు. బాక్సాఫీస్ దగ్గర దీని ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదు. తమిళ అనువాదం భద్రకాళికి టాక్ బాగానే ఉన్నా.. విజయ్ ఆంటోనీ వరుస ఫెయిల్యూర్ల వల్ల తన క్రెడిబిలిటీ, మార్కెట్ దెబ్బ తినడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక సింగిల్ షాట్ మూవీ అంటూ సోషల్ మీడియాలో కాస్త ప్రచారం పొందిన ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు గురించి చెప్పడానికి ఏమీ లేదు. కొత్త సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పాత చిత్రాలైన మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్‌కే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆదివారం ఈ చిత్రాలకు హౌస్ ఫుల్స్ పడేలా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates