లాలెట్టన్ రికార్డునే చెరిపేసిన లోకా

మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఏ ర‌క‌మైన రికార్డుల లిస్టు తీసినా.. అందులో ముందు వ‌రుస‌గా మోహ‌న్ లాల్ పేరే క‌నిపిస్తుంది. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా అద్భుత‌మైన న‌ట‌న‌తో అల‌రిస్తున్న ఈ లెజెండ‌రీ న‌టుడు.. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌ల‌యాళంలో తొలి రూ.50 కోట్లు, రూ.100 కోట్లు, రూ.150 కోట్లు, రూ.250 కోట్ల రికార్డులు ఆయ‌న‌వే. 

చివ‌ర‌గా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజైన ఎల్-2 ఎంపురాన్ సినిమాతో కొత్త ఇండ‌స్ట్రీ రికార్డును నెల‌కొల్పాడు లాలెట్ట‌న్. ఆ సినిమా రూ.268 కోట్ల వ‌సూళ్ల‌తో మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఇక ఇప్పట్లో ఎంపురాన్ రికార్డు బ‌ద్ద‌లు కాద‌ని.. ఒక‌వేళ అయినా అది మోహ‌న్ లాల్‌కే సాధ్య‌మ‌ని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డును సొంతం చేసుకుని అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆ చిత్ర‌మే.. లోక‌.

క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌లో డొమినిక్ అరుణ్ అనే యువ ద‌ర్శ‌కుడు రూపొందించిన చిత్రం.. లోక‌. ఈ మూవీని స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రొడ్యూస్ చేయ‌డం విశేషం. మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లోనూ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా రిలీజైన నాలుగో వారంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఐతే క‌ళ్యాణి ఈ రికార్డును సొంతం చేసుకోవ‌డం లాల్‌కు ఎంతో ఆనందాన్నిచ్చే విష‌య‌మే. ఆమె ఆయ‌న కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలు. 

మోహన్ లాల్ ఆప్త‌మిత్రుడైన ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురే క‌ళ్యాణి. ఆమె త‌ల్లి లిజి ఒక‌ప్పుడు తెలుగు సినిమాల్లోనూ న‌టించింది. ప్రియ‌ద‌ర్శ‌న్‌తో మోహ‌న్ లాల్ 30కి పైగా సినిమాలు చేయ‌డం విశేషం. క‌ళ్యాణి హీరోయిన్ అయిన‌పుడు మోహ‌న్ లాల్ ఆమెకు స‌పోర్ట్‌గా నిలిచాడు. ఆయ‌న త‌న‌యుడు ప్ర‌ణ‌వ్.. క‌ళ్యాణితో క‌లిసి హృద‌యం అనే బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కూడా చేశాడు. వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ వీళ్లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం అన్నాచెల్లెళ్ల‌లా ఫీల‌వుతార‌ని త‌ర్వాత వెల్ల‌డైంది. త‌న పేరిట ఉన్న ఇండ‌స్ట్రీ హిట్ రికార్డును స్నేహితుడి కూతురే బ‌ద్ద‌లు కొడితే లాల్ ఎంతో హ్యాపీగా ఫీల‌వుతుంటాడ‌న‌డంలో సందేహం లేదు.