తమకు చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళను పొగుడుకోవడం ఇండస్ట్రీలో మాములే. అయితే అవి వ్యక్తిగత భజనలుగా మారి ఏకంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తప్పే. నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ తన బాస్ అల్లు అరవింద్ ని ఆకాశానికెత్తే క్రమంలో లెజెండరీ హాస్యనటులు అల్లు రామలింగయ్యగారిని తక్కువ చేసేలా మాట్లాడ్డం ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిందే. గీతా ఆర్ట్స్ 2 నుంచి బయటికి వచ్చి స్వంత కుంపటి పెట్టుకున్న బన్నీ వాస్ ఎందుకు ఇంత పొగడ్తలకు తెగబడ్డారో అంతుచిక్కడం లేదు.
బండ్ల గణేష్ అన్న మాటలకు కౌంటర్ గా బన్నీ వాస్ మాట్లాడుతూ అల్లు అరవింద్ పుట్టాకే అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ అయ్యారని సెలవిచ్చారు. ఇది ఎక్కడా చూడని అతి పెద్ద జోకు. ఎందుకంటే రామలింగయ్య గారు నటుడిగా కెరీర్ మొదలుపెట్టేనాటికి అరవింద్ వయసు కేవలం నాలుగు సంవత్సరాలు. అంటే యాక్టర్ అవ్వక ముందే కొడుకు ఉన్నారన్న మాట. 1974లో అరవింద్ నిర్మాణ భాగస్వామిగా బంట్రోతు భార్య తీసే టైంకి అల్లు రామలింగయ్య గారు పీక్స్ లో ఉన్నారు. సూర్యకాంతం కాలం నుంచి రావుగోపాలరావు హయాం దాకా పెద్దాయన లేని సినిమా లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
స్వశక్తితో ఇండస్ట్రీకి వచ్చిన కొంతకాలానికే రామలింగయ్యగారు గొప్ప స్థితికి చేరుకున్నారు. ఇక్కడ అరవింద్ ప్రమేయం, చొరవ కానీ ఏమి లేదు. పైపెచ్చు గీతా ఆర్ట్స్ సంస్థకు పునాది వేసింది, పేరు పెట్టింది, మార్గదర్శిగా నిలిచి అల్లు అరవింద్ కి తోడుగా నిలబడింది రామలింగయ్యగారే. ఆ మాటకోస్తే అరవింద్ తొలినాళ్ళలో చాలా కాలం ఆయన అబ్బాయిగా గుర్తింపు పొంది, 1980 తర్వాత స్వంతంగా తనకంటూ బ్రాండ్, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా కొడుకు వల్ల తండ్రి స్టార్ అయ్యాడంటే అది విచిత్రాల్లోకెల్లా విచిత్రం. రామ్ చరణ్ వల్ల చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటే ఎవరైనా ఒప్పుకుంటారా. ఫ్యాన్స్ అయితే కొడతారు. బన్నీ వాస్ చెప్పిన ఉదాహరణ అచ్చం ఇలాగే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates