టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే వింతగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. రెండు వారాల క్రితం విడుదలైన ఘాటీ ఎంత పెద్ద డిజాస్టరో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అనుష్క కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాపుగా దారుణమైన వసూళ్లను తీసుకొచ్చింది. కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం వచ్చినా కొంత ఊరట దక్కేది కానీ అదీ జరగకపోవడం యువి క్రియేషన్స్ కు తీవ్ర నష్టాలు మిగిల్చింది. మరి దీని ప్రభావమో లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ అనుష్క మాత్రం సోషల్ మీడియా నుంచి సెలవు తీసుకుంది. మళ్ళీ కలుస్తానంటూ ఫ్యాన్స్ కు మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇదంతా అయిపోయిన గతం.
ఇక వర్తమానానికి వస్తే ఘాటీ ఎంత డిజాస్టర్ అయినా అందులో చూపించిన లొకేషన్లు సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడు క్రిష్ ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని చాలా రిస్కీ ప్రాంతాల్లో తీశారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉండే డుడుమ జలాశయం, మచ్ఖండ్ విద్యుత్ కేంద్రం, వించి హౌస్, వ్యూ పాయింట్, బలడ కేవ్స్ లాంటి ఏరియాలకు టూరిస్టుల తాకిడి బాగా పెరిగిందట. ఘాటీ సినిమా థియేటర్లో చూడని వాళ్ళు సైతం ట్రైలర్ గట్రా చూసి దీని గురించి తెలుసుకుని మరీ అక్కడికి వస్తున్నారట. ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరగడంతో తమకు ఆదాయం పెరిగిందని స్థానికంగా ఉండే వ్యాపారులు చెప్పడం గమనార్హం.
ఘాటీలో కొన్ని సీన్లు తప్ప మిగిలినదంతా రియల్ గా షూట్ చేసిన క్రిష్ ఈ రకంగా ఒక మంచి చేశారన్న మాట. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. గ్రీన్ మ్యాట్ల ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం చేసుకోలేని అయోమయం తలెత్తుతున్న ఇప్పటి ట్రెండ్ లో ఇలా ఇంత సుదీర్ఘమైన అవుట్ డోర్ షూటింగ్ చేసుకోవడం విశేషమే. అన్నట్టు ఘాటీ ఓటిటి రిలీజ్ అక్టోబర్ 2 ఉండొచ్చని డిజిటల్ టాక్. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకుంది. నాలుగు వారాల విండో కనక ఆ డేట్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates