చిన్న రౌడీకి పాస్ మార్కులు పడ్డట్లేనా?

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వారసత్వాన్నందుకుని తెరంగేట్రం చేసిన కుర్రాడు ఆనంద్ దేవరకొండ. ఐతే ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడి తొలి సినిమా ‘దొరసాని’ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ సినిమా ఆడకపోవడం ఓ సమస్య అయితే.. ఆనంద్ లుక్స్, నటన విషయంలో విమర్శలు రావడం మరో సమస్య. ఐతే విజయ్ బ్యాకప్ వల్ల ఆనంద్‌కు అవకాశాల విషయంలో లోటు లేకపోయింది.

పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన భవ్య క్రియేషన్స్‌లో తన రెండో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు ఆనంద్. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఆ చిత్రమే.. మిడిల్ క్లాస్ మెలొడీస్. నాలుగు రోజుల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనే రాబట్టుకుంటోంది. థియేటర్లలో విడుదలైతే స్పందన ఎలా ఉండేదో ఏమో కానీ.. ఓటీటీలో ఈ సినిమాను బాగానే చూస్తున్నట్లు ట్రెండ్స్‌ను బట్టి అర్థమవుతోంది.

సోషల్ మీడియాలో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ గురించి జరుగుతున్న చర్చ, జనాల ఫీడ్ బ్యాక్ చూస్తుంటే.. దీన్ని హిట్టు సినిమా అనేయొచ్చు. ఐతే ఈ సినిమా వల్ల ఆనంద్‌కు ఏమాత్రం ప్రయోజనం చేకూరుతుందనేది ప్రశ్న. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ గురించి మాట్లాడేవాళ్లందరూ ఇతర పాత్రధారుల గురించే చర్చిస్తున్నారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో చేసిన గోపరాజు రమణ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ప్రధానంగా అతడి గురించే చర్చ జరుగుతోంది. ఇంకా హీరోయిన్ వర్ష బొల్లమ్మ, హీరో ఫ్రెండు, అతడి ప్రేయసిగా నటించిన అమ్మాయి.. హీరోయిన్ తండ్రి పాత్రధారులు చాలా బాగా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాళ్ల ముందు ఆనంద్ నిలవలేకపోయాడనే చెప్పాలి.

ఐతే తొలి సినిమాతో పోలిస్తే మాత్రం లుక్స్, యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడని.. రాఘవ పాత్రకు మిస్ ఫిట్ అనిపించలేదు అనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, అలాగే లుక్స్-యాక్టింగ్ విషయంలో విమర్శలైతే రాలేదు కాబట్టి ఈసారికి ఆనంద్ పాస్ మార్కులు తెచ్చుకున్నట్లే. తర్వాతి సినిమాకు మాత్రం తనదైన ముద్ర వేయకపోతే ఆనంద్ కెరీర్ ముందుకు సాగడం కష్టమే.