ఓజీ ప్లానింగ్ అదరహో..

ఈ మధ్య పెద్ద సినిమాల‌ రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల వాటి ఓపెనింగ్స్ విషయంలో కొంత ఇబ్బంది తప్పడం లేదు. సెన్సార్ చేయించడంలో ఆలస్యం చేస్తున్నారు. అలాగే అదనపు రేట్లు, షోల కోసం ప్రభుత్వాల నుంచి జీవోలు తెప్పించుకోవడంలోనూ ఆలస్యం అవుతోంది. దరఖాస్తు ఆలస్యంగా చేస్తున్నారా.. అక్కడ ప్రభుత్వాల వైపు నుంచి ఆలస్యం జరుగుతోందా తెలియడం లేదు కానీ.. చాలా సినిమాలకు రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు వరకు క్లియరెన్స్ రావట్లేదు. 

దీంతో బుకింగ్స్ బాగా లేటుగా మొదలు పెడుతున్నారు. దీని వల్ల జనాల సమయం వృథా అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా కోత పడుతోంది. అదనపు రేట్లు, షోల వల్ల వచ్చే ప్రయోజనం కూడా దెబ్బ తింటోంది. హరిహర వీరమల్లు, వార్-2, కూలీ.. లాంటి క్రేజీ సినిమాల విషయంలో వాటి మేకర్స్ ఇలాగే ఇబ్బంది పడ్డారు. ఐతే టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ రిలీజ్ ‘ఓజీ’ మేకర్స్ మాత్రం ఆ తప్పు చేయలేదు.

ఈ సినిమాకు ఏపీలో వారం ముందే రేట్లు, షోలకు సంబంధించిన జీవో వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లు చాలా ముందుగానే ప్రిమియర్స్‌కు సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగతా షోలకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతోంది. తెలంగాణలో అదనపు రేట్లు, షోలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనే కారణంతో ‘వీరమల్లు’కు ఛాన్స్ ఇచ్చారే తప్ప.. ‘ఓజీ’కి ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే క్లారిటీ ఉండొచ్చు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగానే ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయే అవకాశాలున్నాయి. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టారు. రెస్పాన్స్ అదిరిపోతోంది. సెన్సార్ కూడా నిన్ననే అయిపోయిందని టాక్.

ప్రమోషన్ల మీద మాత్రం ‘ఓజీ’ టీం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వీకెండ్ అయ్యాక ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశముంది. దాంతో పాటే ఒక ప్రెస్ మీట్ కూడా ఉండొచ్చు. మొత్తానికి ‘ఓజీ’ సరైన ప్లానింగ్‌తోనే అడుగులు వేస్తోంది. కాబట్టి ఓపెనింగ్స్ భారీగా రావడం ఖాయం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే రికార్డులు బద్దలయ్యేలా వసూళ్లు రావడమూ గ్యారెంటీ.