హీరోయిన్ ఇష్టపడితే.. చెల్లీ అని పిలిచిన హీరో

ఒక సినిమా కోసం పని చేస్తూ హీరో హీరోయిన్లు ప్రేమలో పడ్డ సందర్భాలు.. పెళ్లి చేసుకున్న కథలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఇద్దరిలో ఒకరు ప్రేమలో పడి.. ఇంకొకరు తిరస్కరించడమో, లేదంటే పట్టించుకోకపోవడమో జరుగుతుంటాయి. ఇలా ముందుకు సాగకుండా ఆగిపోయిన కథలు చాలానే ఉండొచ్చు. అలాంటి కథనే నిన్నటితరం హీరోయిన్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి జీవితంలో కూడా ఉందట. తెలుగులో ‘గులాబి’ లాంటి బ్లాక్ బస్టర్ సహా అనేక చిత్రాల్లో నటించిన మహేశ్వరికి.. తమిళంలోనూ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌తో ఆమె రెండు సినిమాల్లో నటించింది.

అవే.. ఉల్లాసం, నీసమ్. ఐతే అజిత్‌తో కలిసి నటిస్తున్న సమయంలో అతణ్ని మహేశ్వరి ఇష్టపడిందట. ఐతే తన ప్రేమకథ మొదలే కాకుండా ఎలా ఆగిపోయిందో.. సీనియర్ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో మహేశ్వరి వెల్లడించింది.

‘‘అజిత్ నటుడిగానే కాక వ్యక్తిగతంగానూ ఆయన చాలా ఇష్టం. ఆయన్ని నా క్రష్ కంటే మించి అని చెప్పొచ్చు. ఈ విషయంలో ఒక శాడ్ స్టోరీ ఉంది. ఆయనతో నేను రెండు సినిమాలు చేశాను. అజిత్ గారితో చేసిన రెండో సినిమా అనుకోని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఏడాదిన్నర పాటు షూటింగ్ జరిగింది. ఈ రకంగా ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది.

ఈ సినిమా షూటింగ్ చివరి రోజు ఇక మళ్లీ ఆయన్ని కలవలేమే అని బాధేసింది. నేను ముభావంగా కూర్చుని ఉంటే.. అజిత్ నా దగ్గరికి వచ్చారు. ‘నువ్వు నా చెల్లెలు మాదిరి. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు. నేను నీకు ఎప్పటికీ అండగా ఉంటాను’ అని చెప్పి వెళ్లిపోయారు. అసలే ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధలో ఉన్న నాకు ఈ మాటలు మరింత బాధ కలిగించాయి. అలా నా లవ్ స్టోరీ మొదలు కాకుండానే ఆగిపోయింది’’ అని మహేశ్వరి వెల్లడించింది. ఆ సినిమా పేరేంటో మహేశ్వరి చెప్పలేదు కానీ.. అది ‘ఉల్లాసం’ అని అర్థమైపోయింది. ఈ చిత్రంలో విక్రమ్ మరో హీరోగా నటించాడు.