స్లో పాయిజన్ ఎక్కిస్తున్న తమన్

ఓజి విషయంలో దర్శకుడు సుజిత్ మీద ఎంత బాధ్యత ఉందో అంతే సమానంగా తమన్ మీద కూడా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఒక్కొక్కటిగా వదులుతున్న పాటల ద్వారా తాను ఇవ్వబోయే కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతోందో తమన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. అభిమానులకు ఇన్స్ టాంట్ గా ఎక్కేస్తున్నా సగటు సంగీత ప్రియులకు మాత్రం స్లో పాయిజన్ గా మెదడుకు చేరుకుంటోంది. తాజాగా విడుదల చేసిన గన్స్ అండ్ రోజెస్ లో తమన్ వాడిన వాయిద్యాలు, కంపోజింగ్ చాలా ఫ్రెష్ గా అనిపించడమే కాదు జపాన్, కొరియా పదాలు, సౌండింగ్ తో చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ కు తమన్ స్వరాలు అందించడం ఇది మొదటిసారేం కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోకు ఇచ్చాడు. కానీ అవన్నీ రీమేకులు. కమర్షియల్ ఫ్లేవర్ తక్కువగా ఉండి ఎక్కువ మాస్ టచ్ చూపించే అవకాశం ఇవ్వలేదు. కానీ ఓజి అలా కాదు. ఇది పక్కా స్ట్రెయిట్ మూవీ. దర్శకుడు సుజిత్ తన ఫ్యానిజంని ఆవిష్కరించబోయే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కథ. మేకింగ్ నుంచి ప్రమోషన్ దాకా ఎందులోనూ కాంప్రమైజ్ లేకుండా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. తమన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి ఎంత సతాయించాలో అంతా చేశాడు. ఇప్పుడు చివరి ఘట్టం వచ్చేసింది.

సాంగ్స్ వింటేనే ఇలా ఉందంటే ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ పేకాడి ఉంటాడని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దీని కోసమే అఖండ 2కి టైం కేటాయించలేక పరోక్షంగా దాని వాయిదాకు తానూ ఒక కారణంగా నిలిచిన తమన్ కు ఓజి సక్సెస్ ఇంకో కోణంలో కూడా అవసరం. జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ ఫలితం తనను చాలా తీవ్రంగా నిరాశపరిచింది. లోపం దర్శకుడు శంకర్ ఇచ్చిన కంటెంట్ పరంగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. ఓజికి అలా కాదు. అనౌన్స్ మెంట్ స్టేజి నుంచి రిలీజ్ దాకా ఓ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మోస్తోంది. వాటిని నిలబెట్టుకోవడమే తరువాయి.