ఆడియన్స్ పిచ్చోళ్లా మీరు-లిటిల్ హార్ట్స్ మౌళి

తమ సినిమాను గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులను దేవుళ్లని కీర్తిస్తుంటారు హీరోలు. కానీ యంగ్ హీరో మౌళి మాత్రం ‘లిటిల్ హార్ట్స్’ను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌ను పట్టుకుని పిచ్చోళ్లా మీరు అని ప్రశ్నించాడు. ఐతే ఇదంతా సరదాగానేలెండి. తమ మీద మరీ ఇంత ప్రేమ ఏంటో అర్థం కావడం లేదంటూ ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్లో మౌళి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన ప్రసంగం ఆరంభంలోనే అతను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఆడియన్స్ పిచ్చోళ్లా మీరు.. ఈ సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారేంటి’’ అని మౌళి అనడంతో వెనుక ఉన్న నిర్మాత బన్నీ వాసు ఒకింత కంగారు పడ్డాడు. తర్వాత మౌళి కొనసాగిస్తూ.. తాము మంచి సినిమా చేశామని తెలుసని.. ఐతే తొలి వారంలో ఒక మోస్తరుగా జనం వస్తారని, రెండో వారం నుంచి సినిమా గురించి జనాలకు తెలిసి ఆడియన్స్ పెరుగుతారని అంచనా వేశామని తెలిపాడు.

సినిమా గురించి జనానికి తెలిసేలా చేశామని తెలుసని.. కానీ తొలి రోజు నుంచే ‘లిటిల్ హార్ట్స్’కు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని మాత్రం ఊహించలేదన్నాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స వేస్తే అవి ఫుల్స్ అయిపోయాయని.. రిలీజ్ రోజు ఫుల్సే అని.. ఆ తర్వాత సినిమాకు తాము ఎవ్వరూ ఊహించని రెస్పాన్స్ వచ్చిందని మౌళి తెలిపాడు. డే-1 రెండున్నర కోట్ల కలెక్షన్ వచ్చిందని.. అది తమ బడ్జెట్ కంటే ఎక్కువ అని అతను చెప్పాడు. ఈ రోజుల్లో ఓటీటీని దాటి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం చాలా కష్టమనే అందరూ అంటున్నారని.. ఇలాంటి టైంలో తమ సినిమా ఇలా ఆడడం ఆశ్చర్యమన్నాడు.

తన మీద ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపించడం కలలా ఉందని మౌళి అన్నాడు. ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది పెద్దవాళ్లు ఫోన్లు చేశారని.. ట్వీట్లు పెట్టారని.. వాళ్లందరికీ రుణ పడి ఉంటానని మౌళి చెప్పాడు. బండ్ల గణేష్ ఫోన్ చేసి ఇరగ**గావు అని ఆయన స్టయిల్లో కామెంట్ చేశాడని.. రవితేజ కాల్ చేసి తాను యంగ్ ఏజ్‌లో నటించినట్లే చేశావని కొనియాడాడని.. తన ఫేవరెట్ హీరో నాని ట్వీట్ పెట్టాడని.. ఇవన్నీ చూసి తాను గాల్లో తేలిపోతున్నానని మౌళి తెలిపాడు.

ఈ వారమంతా తాను గాల్లోనే ఉంటానని.. అప్పుడప్పుడూ మాత్రం ఇలా నేల మీదికి వస్తానని చెప్పాడు. ఇక ముందు కూడా తాను మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని.. ప్రేక్షకులు పెట్టే రూపాయికి పది రూపాయల వినోదం ఇవ్వడానికి.. నిర్మాతలు పెట్టే రూపాయికి పది రూపాయలు సంపాదించి పెట్టడానికే ప్రయత్నిస్తానని అతను హామీ ఇచ్చాడు.