దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినా.. సరిహద్దుల్లో భారత సైన్యం ఏదైనా పెద్ద ఆపరేషన్ చేపట్టి అందులో విజయం సాధించినా.. శత్రు దేశాలపై సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించినా.. వాటి మీద వీలైనంత త్వరగా సినిమాలు తీసేస్తుంటారు బాలీవుడ్ ఫిలిం మేకర్స్. ఈ ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మీద ఆల్రెడీ బోలెడంతమంది కథలు రెడీ చేసుకుంటున్నారు. మరి ఎవరు ముందుగా సినిమా తీస్తారో చూడాలి.
ఈ ట్రెండును బాగా అందిపుచ్చుకునే హీరోగా అక్షయ్ కుమార్‌కు పేరుంది. ఐతే ఈ తరహా సినిమాల్లో పెద్దగా నటించని సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ పేరుతో సినిమాకు రెడీ అయిపోయాడు. తాను సైనిక దుస్తుల్లో కనిపిస్తుండగా.. ఫస్ట్ షాట్ కోసం క్లాప్ కొట్టిన ఫొటోను సల్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి డిజాస్టర్ తీసిన అపూర్వ లఖియా.. సల్మాన్‌తో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా తీస్తున్నాడు. 2020లో చైనా సైన్యంతో ఇండియన్ ఆర్మీ వీరోచితంగా పోరాడి శత్రు దేశంపై పైచేయి సాధించిన వైనంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ పోరాటంలో తెలుగువాడైన సంతోష్ బాబుతో సహా 20 మంది దాకా భారత సైనికులు చనిపోయారు. ఈ చిన్నపాటి యుద్ధం మీద సల్మాన్ సినిమా తీయడం బాగానే ఉంది కానీ.. దీని మీద సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు.
సల్మాన్ చైనాతో ఇండియా పోరు మీద సినిమా తీస్తాడు కానీ.. పాకిస్థాన్‌ను విలన్‌గా చూపించే సినిమాలు మాత్రం చేయడంటూ అతణ్ని ఎటాక్ చేస్తున్నారు. పహల్గాం దాడి సమయంలో ఆ దేశాన్ని విమర్శించలేదని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోయినపుడు మాత్రం సోషల్ మీడియా పోస్టు పెట్టాడని.. ఇప్పుడు ‘గాల్వాన్’ మీద మూవీ చేస్తున్న సల్మాన్.. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ మీద మాత్రం ఎందుకు సినిమా తీయడని ప్రశ్నిస్తున్నారు. సల్మాన్‌కు పాకిస్థాన్‌లో తనకున్న భారీ ఫాలోయింట్, మార్కెట్ కావాలని.. అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా సినిమాలు చేయడని ఎద్దేవా చేస్తోంది ఒక వర్గం సోషల్ మీడియా.
Gulte Telugu Telugu Political and Movie News Updates