OG మేనియా – రికార్డు స్థాయిలో కటౌట్లు

ఇంకో పదిహేను రోజుల్లో విడుదల కాబోతున్న ఓజి సంబరాల కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ప్రమోషన్లు భీభత్సంగా జరగకపోయినా ఇప్పటికే ఉన్న హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ వస్తాయనే భరోసా అటు బయ్యర్లలోనూ కనిపిస్తోంది. ఓవర్సీస్ లో తక్కువ టైంలో వన్ మిలియన్ మార్కు అందుకున్న ఓజాస్ గంభీరా నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరింత స్పీడ్ పెంచుతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ అనిపించే స్థాయిలో, చిరకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దానికి మొదటి అడుగు హైదరాబాద్ కానుంది.

కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ ప్రాంగణంలో మొత్తం 33 పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కటవుట్లు పెట్టబోతున్నారని సమాచారం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలుపెట్టి ఓజి దాకా పవన్ కనిపించిన ప్రతి సినిమా తాలూకు పాత్రను నిలువెత్తు రూపంలో చేయించి ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పెట్టడం ఇదే మొదటిసారని ఫ్యాన్ అసోసియేషన్ చెబుతోంది. గతంలో బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ కోసం గంధదగుడి టైంలో ఇలా 30 కటవుట్లు పెట్టారు. ఆ రికార్డుని బ్రేక్ చేయడం కోసమే పవన్ అభిమానులు 33 ఎంచుకున్నారు. వీటి లాంచింగ్ కోసం ప్రత్యేకంగా సెలబ్రిటీలను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట.

బిజినెస్ పరంగా భారీ అంచనాలు మోస్తున్న ఓజి టాలీవుడ్ బాక్సాఫీస్ కు జోష్ తెస్తుందనే నమ్మకంతో ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిటిల్ హార్ట్స్ తప్పించి జనాన్ని హాళ్లకు రప్పించిన సినిమాలు పెద్దగా లేవు. మిరాయ్, కిష్కిందపురి కనక పాజిటివ్ టాక్ తో వర్కౌట్ చేసుకుంటే ఓజి వచ్చేదాకా థియేటర్లు నింపే బాధ్యత అవి చూసుకుంటాయి. ఓజికి టాక్ ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా రికార్డుల మోత మోగడం ఖాయం. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ మూడో వారంలో విజయవాడ వేదికగా ప్లాన్ చేస్తున్నారు.