అనిల్ – మహేష్ కాంబో: ఎలా సెట్ అయ్యిందో తెలుసా?

దిల్ రాజుకు మ‌హేష్‌, అనిల్ రావిపూడి ఇచ్చిన షాక్
అనిల్ రావిపూడికి ద‌ర్శ‌కుడిగా పెద్ద ప్ర‌మోష‌న్ ఇచ్చిన సినిమా.. స‌రిలేరు నీకెవ్వ‌రు. ఆ సినిమాకు ముందు వ‌ర‌కు అత‌ను ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌-2 లాంటి మిడ్ రేంజ్ సినిమాలే తీశాడు. అలాంటిది ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పెద్ద బ‌డ్జెట్లో సినిమా చేసే అవకాశం వ‌చ్చింది. దీన్ని పూర్తిగా ఉప‌యోగించుకుని సూప‌ర్ హిట్ అందించాడు అనిల్. ఐతే ఈ సినిమా ఓకే కావ‌డం అగ్ర నిర్మాత దిల్ రాజుకు పెద్ద షాక్ అంటున్నాడు నిర్మాత అనిల్ సుంక‌ర‌.

రాజు కూడా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో భాగ‌స్వామే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు తెలియ‌కుండానే ఈ ప్రాజెక్టు ఓకే అయింద‌ని.. ఓవైపు మ‌హేష్ బాబు రాజు బేన‌ర్లో మ‌హ‌ర్షి చేస్తుండ‌గానే.. ఆయ‌న‌కు తెలియ‌కుండా ఈ సినిమాను తాను, అనిల్ ఓకే చేయించుకున్నామ‌ని అనిల్ వెల్ల‌డించాడు. అస‌లు స‌రిలేరు నీకెవ్వ‌రు ఎలా ఓకే అయింది అన్న‌ది ఆయ‌న ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

”మ‌హేష్ బాబు గారి స్పైడ‌ర్ సినిమా చూసి నేను త‌ట్టుకోలేక‌పోయాను. అప్ప‌టికే ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వంతో ఎదురు దెబ్బ తిన్నారు. అప్పుడే ఆయ‌న్ని వెళ్లి క‌లిస్తే ఈసారి దూకుడు త‌ర‌హాలో మంచి ఎంట‌ర్టైన‌ర్ చేయాల‌ని ఇద్ద‌రం మాట్లాడుకున్నాం. ఎవరితో చేద్దామ‌న్న‌ది మీరే ఆలోచించండ‌ని మ‌హేష్ చెప్పారు. స్పైడ‌ర్ వ‌చ్చిన కొన్ని వారాల‌కే రాజా ది గ్రేట్ రిలీజైంది. అది చూసి అనిల్ రావిపూడితో సినిమా చేస్తే బాగుంటుంద‌ని నేను అంటే.. మ‌హేష్ ఏమీ అభ్యంత‌రం లేద‌న్నాడు.

ఎఫ్‌-2 పెద్ద స‌క్సెస్ అయ్యాకే మ‌హేష్.. అనిల్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు చేశాడ‌ని అంతా అనుకుంటారు. కానీ ఆ సినిమా కంటే ముందే స‌రిలేరు నీకెవ్వ‌రు ఓకే అయిపోయింది. అప్ప‌టికి మ‌హేష్.. దిల్ రాజు బేన‌ర్లో మ‌హ‌ర్షి చేస్తున్నాడు. మ‌రోవైపు అనిల్ కూడా రాజు సంస్థ‌లోనే రాజా ది గ్రేట్ చేసి, ఎఫ్‌-2కు రెడీ అవుతున్నాడు. అప్పుడే ఆయ‌న‌కు తెలియ‌కుండానే క‌థ ఓకే అయిపోయింది. సింగిల్ సిట్టింగ్‌లో మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు క‌థ‌కు ఓకే చెప్పేశాడ‌ని.. అలా మ‌హేష్‌, అనిల్ ఇద్ద‌రూ రాజు చేతుల్లో ఉండ‌గానే, ఆయ‌న‌కు తెలియ‌కుండానే ఈ సినిమా ఫిక్స్ అయిపోయింది. అనిల్‌కు రాజుతో త‌ర్వాతి సినిమా చేసే క‌మిట్మెంట్ ఉండ‌డంతో ఆయ‌న కూడా ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామి అయ్యారు” అనిల్ సుంక‌ర వెల్ల‌డించారు.