OG విలన్ మామూలోడు కాదు

అందరూ ఓజిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ చూసి మురిసిపోతున్నారు కానీ విలన్ గా ఇమ్రాన్ హష్మీని తీసుకోవడం వెనుక దర్శకుడు సుజిత్ ఎంత తెలివైన ఆలోచన చేశాడో గమనించట్లేదు. ఇప్పటి జనరేషన్ కి ఇమ్రాన్ అంటే పెద్దగా అవగాహన లేదు. సల్మాన్ ఖాన్ టైగర్ 3 చూసినవాళ్లు గుర్తు పడతారు కానీ ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. మొన్నామధ్య సోలో హీరోగా గ్రౌండ్ జీరో అనే బాలీవుడ్ మూవీ చేసినా ఫ్లాప్ అయ్యింది. అయితే ముప్పై నలభై వయసు దాటిన వాళ్లకు ఇమ్రాన్ హష్మీ రేంజ్ ఏంటో బాగా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

ఇరవై రెండేళ్ల క్రితం 2003లో ఫుట్ పాత్ తో ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్రాన్ హష్మీ రెండో సినిమా మర్డర్ తో ఒక్కసారిగా యూత్ సెన్సేషన్ అయ్యాడు. అందులో మల్లికా శరావత్ లో మనోడు చేసిన రొమాన్స్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. 2005 ఆషిక్ బనాయా ఆప్నేలో తనుశ్రీ దత్తాతో చేసిన హాట్ సాంగ్ కోసమే కుర్రాళ్ళు థియేటర్లకు క్యూ కట్టడం అబద్దం కాదు. ఒక్క పాట కనకవర్షం కురిపించింది. ఆ తర్వాత పెర్ఫార్మన్స్ ప్రదర్శించే సినిమాలు చేశాడు కానీ జనాలు ఇతన్ని ముద్దుల వీరుడిగానే గుర్తు పెట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్, అవారాపన్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై లాంటి మంచి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి.

2010 తర్వాత స్పీడ్ తగ్గించిన ఇమ్రాన్ హష్మీ ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. మార్కెట్ మరీ తీవ్రంగా పెరగలేదు కానీ ఇప్పుడు విలన్ గా సరైన కంటెంట్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కు ధీటుగా నిలబడే కటవుట్ రెగ్యులర్ గా ఉండకూడదని భావించిన సుజిత్ ముంబై వెళ్లి మరీ ఇమ్రాన్ హష్మీని ఒప్పించుకుని వచ్చాక ఇది సైన్ చేశాకే అడవి శేష్ గూఢచారి 2 ఒప్పుకున్నాడు. అందరూ ఆశిస్తున్నట్టు ఓజి కనక బ్లాక్ బస్టర్ అయితే సౌత్ లో ఇమ్రాన్ హష్మీకి మరిన్ని అవకాశాలు దొరుకుతాయి. ఒక్కసారి డిమాండ్ వస్తే చాలు రెమ్యునరేషన్లు భారీగా పెరుగుతాయని చెప్పనక్కర్లేదు.