త‌మ‌న్ త‌గ‌ల‌బెట్టేసేలా ఉన్నాడు

మ‌న‌వాడు కాక‌పోయినా.. అనిరుధ్ ర‌విచంద‌ర్‌కు తెలుగు సినీ అభిమానులు మామూలు ఎలివేష‌న్ ఇవ్వ‌రు. గ‌త ద‌శాబ్ద కాలంలో తెలుగు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను వెన‌క్కి నెట్టి అత‌ను తిరుగులేని క్రేజ్ సంపాదించాడు తెలుగు అభిమానుల్లో. త‌న త‌మిళ సినిమాలు చూసి మ‌న వాళ్లు ఊగిపోతుంటారు. తెలుగులో అప్పుడ‌ప్పుడూ చేసే సినిమాల విష‌యంలోనూ ఎగ్జైట్ అవుతుంటారు. మ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు త‌నలా వైర‌ల్ సాంగ్స్, ఊపున్న బీజీఎం ఇవ్వ‌ట్లేదేంట‌ని సోష‌ల్ మీడియాలో ఒకింత నిరాశ వ్య‌క్తం చేస్తుంటారు. ఈ విష‌యంలో టాలీవుడ్ నంబ‌ర్ వన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఒకింత అసంతృప్తితో ఉన్న‌ట్లే క‌నిపించాడు.

ఈ మ‌ధ్య ఒక ఇంట‌ర్వ్యూలో అత‌ను మాట్లాడుతూ.. అనిరుధ్ సంగీతం అందించిన సినిమాల పేర్లు ప్ర‌స్తావించి మ‌రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాతో వాటికి స‌మాధానం చెబుతా అని స‌వాలు విసిరాడు. జైల‌ర్, విక్ర‌మ్, లియో, బీస్ట్ చిత్రాలను ఉదాహ‌ర‌ణ‌గా అత‌ను చూపించి.. వాటికి త‌న స‌మాధానం ఓజీ అన్నాడు. ఈ సినిమా పాట‌లు, బీజీఎం మామూలుగా ఉండ‌వ‌ని.. త‌న మాట‌ల్లో అతిశ‌యోక్తి లేద‌ని సినిమా చూసినపుడు ఒప్పుకుంటార‌ని త‌మ‌న్ అన్నాడు.

ఓజీ నుంచి రిలీజ‌వుతున్న ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ చూస్తుంటే త‌మ‌న్ మాటల్లో అతిశ‌యోక్తి లేద‌నే అనిపిస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ టీజ‌ర్‌తోనే బీజీఎంతో హోరెత్తించేశాడు త‌మ‌న్. త‌ర్వాత ఫైర్ స్టార్మ్ సాంగ్ అభిమానుల‌కు పిచ్చెక్కించేసింది. ఇటీవ‌లే రిలీజ్ చేసి సువ్వి సువ్వాల అంటూ సాగిన‌ సూతింగ్ మెలోడీ సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకుంది. దాంతో క్లాస్ అభిమానులను ఆక‌ట్టుకున్న త‌మ‌న్.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు కానుక‌గా రిలీజైన గ్లింప్స్‌తో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించాడు.

త‌మ‌న్ మ్యూజిక్‌లో రెగ్యుల‌ర్‌గా వినిపించే సౌండ్స్ ఓజీ ప్రోమోల్లో వినిపించ‌ట్లేదు. సౌండింగ్ కొత్త‌గా ఉంది. చాలా స్టైలిష్‌గా అనిపిస్తోంది. కేవ‌లం ప్రోమోల్లోనే ఎలివేష‌న్ మామూలుగా లేదు. ఇక సినిమాలో త‌మ‌న్ ఇంకెంత విజృంభించి ఉంటాడో అని ప‌వ‌న్ ఫ్యాన్స్ అంచ‌నాలు పెంచేసుకుంటున్నారు. ఈ ఊపు చూస్తుంటే ఈ నెల 25న థియేట‌ర్ల‌ను త‌మ‌న్ షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.