హారర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేయడానికి కారణమైన వాళ్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అజయ్ దేవగన్, ఊర్మిళాతో తీసిన భూత్ ఇప్పటికీ కల్ట్ మూవీగా సినీ ప్రియులు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇదే జానర్ లో పదే పదే సినిమాలు తీయడంతో జనాలకు మొహం మొత్తేసింది. తనలో రియల్ ఫిలిం మేకర్ ని పక్కకు తోసేసి కొంత కాలం పొలిటికల్ అజెండా మూవీస్ తీయడం, అవి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లడం వేరే కథ. శివ, రంగీలా, సత్య లాంటి పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడిలా కావడం పట్ల బాధపడని మూవీ లవర్ ఉండడు. అలాని ఆయన ప్రయత్నాలు చేయడం ఆపట్లేదు.
రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ కథేంటో చెప్పేస్తూ వర్మ ఒక ట్వీట్ పెట్టారు. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాల్చి చంపేస్తాడు. దీంతో పగబట్టిన ఆ డాన్ ఆత్మ తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ అధికారితో పాటు మిగిలిన వాళ్ళను వేధించడం మొదలుపెడుతుంది. దెయ్యం కాబట్టి చంపడం సాధ్యం కాదు. మరి ఏం చేసి దాన్ని ఆట కట్టిస్తారో తెరమీద చూడాలి. హాలీవుడ్ లో ఒకప్పుడు సెన్సేషన్ సృష్టించిన చైల్డ్స్ ప్లేలోని బొమ్మ దెయ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్మ దీన్ని రాసుకున్నట్టు మోషన్ వీడియో చూస్తే అర్థమైపోతుంది.
అరటిపండు ఒలిచినట్టు ఇంత స్పష్టంగా వర్మ స్టోరీ చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేరై థియేటర్ కు రావాలన్న మాట. ఒకప్పటిలా వర్మకు బ్రాండ్ పని చేయడం లేదు. తనను విపరీతంగా అభిమానించే వాళ్ళు సైతం పాత సినిమాలు చూసుకుని మురిసిపోతున్నారు తప్పించి కొత్త రిలీజ్ ఉందంటే థియేటర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అలాంటిది పోలీస్ స్టేషన్ మే భూత్ తో ఎలా మెప్పిస్తారో చూడాలి. సత్య రూపంలో తనకు జీవితాన్ని ఇచ్చిన వర్మ మీద కృతజ్ఞతతో మనోజ్ బాజ్ పాయ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బొమ్మరిల్లు జెనీలియా మరో లీడ్ రోల్ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates