ఒకట్రెండు హిట్లు కొట్టగానే హీరోల పేర్ల ముందు ఏదో ఒక స్టార్ అని ట్యాగ్ యాడ్ అయిపోతుంది. బ్యాగ్రౌండ్ ఉన్నా లేకపోయినా.. ఇది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. పీఆర్ బ్యాచ్‌తో సోషల్ మీడియాలో ఊదరగొట్టించుకుంటూ, బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటూ జనాలకు భ్రమలు కలిగిండానికి ప్రయత్నిస్తుంటారు. ఐతే ‘హనుమాన్’తో తిరుగులేని విజయాన్ని అందుకుని.. మంచి మార్కెట్, ఫాలోయింగ్ సంపాదించుకున్న యువ కథానాయకుడు తేజ సజ్జా మాత్రం ఈ విషయంలో కొంచెం భిన్నంగానే ప్రవర్తిస్తున్నాడు.
తన మాటలు, చేతలు చూస్తే అతనింకా నేల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది. మిగతా హీరోల్లా స్టార్ అనిపించుకోవడానికి అతనేమీ తహతహలాడట్లేదు. పైగా తనకు ట్యాగ్‌లేమీ పెట్టొద్దని మీడియా వాళ్లనే అడుగుతున్నాడు. ‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్లో విలేకరులు తనను పాన్ ఇండియా స్టార్‌గా అభివర్ణిస్తే.. అలాంటి ట్యాగ్స్ వద్దే వద్దు అనేశాడు తేజ. ‘హనుమాన్’ సినిమా పెద్ద హిట్టయి, ఇప్పుడు ‘మిరాయ్’కి కూడా పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ అయిందంటే అందులో తన కష్టం ఎంత ఉందో.. అదృష్టం కూడా అంతే ఉందని.. గ్రహాలు అనుకూలించబట్టే తనకు ఇలా జరిగిందని అతనన్నాడు.
ఇలాంటి విషయాల్లో ఎంత ప్లాన్ చేసినా.. కాలం కలిసి రావడం కూడా చాలా కీలకమని తేజ అన్నాడు. తనకంటే అందంగా ఉన్న వాళ్లు, ప్రతిభావంతులు గల్లీకి పది మంది ఉంటారని.. కానీ అదృష్టవశాత్తూ తాను హీరోగా నిలబడగలిగానని అతనన్నాడు. ‘పాన్ ఇండియా స్టార్’ లాంటి ట్యాగ్స్ అస్సలు వద్దని.. అలా ప్రచారం చేసుకుంటే ‘అబ్బా వీడికి ఇంతుందా’ అన్నట్లు జనాలు అనుకుంటారని.. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలాని అనుకుంటున్నానని తేజ స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates