హీరోయిన్ మీద కిడ్నాప్ కేసు

తమిళంలో మంచి పేరున్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ విచిత్రమైన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆమెపై కేరళలోని కొచ్చిలో కిడ్నాప్ కేసు నమోదు కావడం గమనార్హం. అంతేకాక ఆమె పరారీలో ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆమె కిడ్నాప్ చేసి హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఏం జరగిందంటే..?

కొచ్చిలో ఇటీవల ఒక బార్ దగ్గర లక్ష్మీ మీనన్‌, ఆమె స్నేహితులకు.. ఒక ఐటీ ఉద్యోగి బృందంతో గొడవ జరిగింది. ఐతే ఆ గొడవ కాస్త సద్దుమణిగాక కూడా లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఊరుకోలేదు. పంతం పట్టి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తమ వాహనంతో వెంబడించారు. ఆ వ్యక్తిని ఒక చోట పట్టుకుని కారులోకి బలవంతంగా ఎక్కించారు. లోపల అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ఉద్యోగి తనను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులపై కేసు పెట్టాడు. ఐతే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే లక్ష్మి వారి చేతికి చిక్కలేదు. ఆమె పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.

లక్ష్మి మీనన్ చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తమిళంలో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘కుంకి’ (తెలుగులో గజరాజు)లో నటించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లే. కోలీవుడ్లో ఇంకా పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్, జిగర్ తండా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. మాతృ భాష మలయాళమే అయినా ఆమెకు తమిళంలోనే మంచి పేరు వచ్చింది. డబ్బింగ్ సినిమాలతో లక్ష్మికి తెలుగులోనూ మంచి గుర్తింపే లభించింది. ఈ మధ్య ఆమెకు కాస్త సినిమాలు తగ్గాయి. ఇలాంటి టైంలో ఈ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.