సువ్వి సువ్వాలా… ఫ్యాన్స్ అడిగింది ఇచ్చేలా

ఓజి నుంచి ఇవాళ రెండో ఆడియో సింగల్ రిలీజయ్యింది. సువ్వి సువ్వి అంటూ స్మూత్ గా సాగే మెలోడీని తమన్ కంపోజ్ చేసిన తీరు, గాయని శృతి రంజని పాడిన విధానం రెండూ మ్యూజిక్ లవర్స్ ని వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. కళావతిలాగా టైం పట్టకుండా త్వరగా ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి తమన్ స్థాయి పాట విని చాలా రోజులయ్యింది. ఓజి టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ని ఊపేసినప్పటికీ సాధారణ ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఛార్ట్ బస్టర్ కాలేదు. కానీ ఇప్పుడీ సువ్వి సువ్వి క్లాసు, మాస్ తేడా లేకుండా అందరికీ చేరువయ్యేలా ఉంది.

కల్యాణ చక్రవర్తి రాసిన లిరిక్స్ సింపుల్ గా టచింగ్ గా ఉన్నాయి. పల్లవికి చరణలకు మధ్యలో తమన్ వాడిన ఫ్లూట్ లాంటి వాయిద్యాలు ఒక నోస్టాల్జియా ఫీలింగ్ తీసుకొచ్చాయి. 90 దశకంలో సాగే స్టోరీ కాబట్టి ఆ మూడ్ కు తగ్గట్టు కంపోజ్ చేయడానికి తీసుకున్న శ్రద్ధ సాంగ్ లో బాగా వినిపించింది. విజువల్ గా రివీల్ చేసిన పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ బాగుంది. వయసు వ్యత్యాసం గురించి గతంలో కామెంట్స్ వచ్చినప్పటికీ ఆన్ స్క్రీన్ మాత్రం క్యూట్ పెయిర్ అనిపించేలా దర్శకుడు సుజిత్ డిజైన్ చేసిన విధానం బాగుంది. సో ఓజి నుంచి వచ్చిన రెండు పాటలూ సూపర్ హిట్టేనని చెప్పొచ్చు.

సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న ఓజి హైప్ అప్పుడే ఎక్కడం మొదలయ్యింది. హరిహర వీరమల్లు గాయాన్ని పట్టించుకోకుండా ఫ్యాన్స్ అప్పుడే బెనిఫిట్ షో టికెట్ల కోసం మంతనాలు మొదలుపెట్టారు. తెలివిగా ప్లాన్ చేసుకున్న నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ లో అప్పుడే ఓజి ఆధిపత్యం కనిపిస్తోందని అక్కడి డిస్ట్రిబ్యూటర్ల టాక్. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఫస్ట్ కాపీ వారం ముందు గానే సిద్ధం చేసుకునే ప్రణాలికను రెడీ చేసి ఉంచారట. ట్రైలర్ లాంచ్ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 25 థియేటర్లలో జరగబోయే అరాచకం గురించి అభిమానులు అప్పుడే ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.