‘పెద్ది’ భామకు ‘సుందరి’ పరీక్ష

దేవరతో టాలీవుడ్ కు పరిచయమైన జూనియర్ శ్రీదేవి కం జాన్వీ కపూర్ కు డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ దక్కింది, ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితో వరసగా నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం పెద్దిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 22లో ఎంపికయ్యిందనే టాక్ ఉంది కానీ ఇంకా యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేదు. ఇదిలా ఉండగా సౌత్ లో ఎన్ని ఆఫర్లు వస్తున్నా బాలీవుడ్ లో మాత్రం జాన్వీకు టైం కలిసి రావడం లేదు. గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ గత కొన్నేళ్లలో ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో 29న పరం సుందరి థియేటర్లలో రిలీజ్ కానుంది.

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామా మీద జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ తరహా స్టోరీ లైన్ తో పూర్తి వినోదాన్ని నమ్ముకుని బరిలో దిగుతోంది. మలయాళ కుట్టిగా జాన్వీ పాత్ర స్పెషల్ గా ఉండటంతో పాటు మంచి పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసిందట. తన గత సినిమాలు ఉలజ్, మిస్ అండ్ మిస్టర్ మహి, బవాల్, మిలి, గుడ్ లక్ జెర్రీ, రూహి ఏవీ కనీస ఫలితాలు అందుకోలేదు. గుంజన్ సక్సేనాలాంటివి డైరెక్ట్ ఓటిటికి రావడం వల్ల ఆమెకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. అందుకే పరం సుందరి మీద హిట్టు కొడతానని గంపెడు నమ్మకంతో ఉంది.

ఆక్టోబర్ లో జాన్వీ మరో మూవీ రిలీజవుతుంది. కరణ్ జోహార్ నిర్మించిన సన్నీ సంసారికి తులసి కుమారిలోనూ నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందట. ఆర్టిస్టుగా బిజీగా కాలం గడుపుతోంది కానీ సరైన బ్రేక్ ఎవరిస్తారనే దాని కోసం ఎదురు చూస్తోంది. తను ఎస్ అంటే నటింపజేసేందుకు తెలుగు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కానీ బాలీవుడ్ లో బ్రేక్ దొరికితే తల్లిలాగా పెద్ద స్థాయికి వెళ్లాలనేది జాన్వీ టార్గెట్. అయితే శ్రీదేవి లాగా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తే తప్పకుండా ఆమె అనుకున్న కోరుకున్నది జరుగుతుంది. అందుకే తెలుగు ఆఫర్లను సీరియస్ గా పరిగణిస్తోందని ముంబై మీడియా టాక్.