రోడ్డు ప్రమాదం తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేసిన తొలి చిత్రం విరూపాక్ష పెద్ద విజయం సాధించి అతడికి మంచి బ్రేకే ఇచ్చింది. కానీ తన కెరీర్ మాత్రం కొంచెం స్లో అయింది. సంపత్ నందితో అనుకున్న గాంజా శంకర్ ఏవో కారణాలతో ముందుకు కదల్లేదు. తర్వాత చాలా టైం తీసుకుని సంబరాల ఏటిగట్టు అనే సినిమాను మొదలుపెట్టాడు తేజు. ఇది అతడి కెరీర్లోఏ అత్యధిక బడ్జెట్, భారీ సెటప్‌తో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసినపుడు దసరా రిలీజ్ అని ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే చెప్పిన రిలీజ్ డేట్‌కు నెల రోజులే సమయం ఉండగా.. టీం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. టీజర్ వచ్చాక షూట్ గురించి అసలు ఏ సమాచారం లేదు.
చిత్రీకరణ ఏ దశలో ఉంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అనే విషయాలేవీ వెల్లడించడం లేదు. మరి టీం ఎందుకిలా సైలెంట్‌గా ఉంది అన్నది అర్థం కాని విషయం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు తలెత్తాయట. అందుకే సినిమా అనుకున్నట్లుగా ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.
హనుమాన్ సినిమాతో భారీ విజయాన్నందుకున్న నిరంజన్ రెడ్డి సంబరాల ఏటి గట్టు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విరూపాక్ష వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం.. హనుమాన్ సినిమాతో ఘనవిజయాన్నందుకున్న ఉత్సాహంతో వంద కోట్లకు పైగా బడ్జెట్ అనుకుని ఈ సినిమాను మొదలుపెట్టారు. ఐతే సినిమా మధ్య దశలో ఉండగానే అనుకున్నమొత్తం బడ్జెట్ ఖర్చయిపోయిందట.
ఆల్రెడీ వంద కోట్లు ఖర్చు దాటిపోగా.. ఇంకా తీయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇంతలో కార్మికుల సమ్మె వచ్చింది. దీంతో షూట్ ఆగింది. ఇప్పుడు కార్మికుల జీతాలు కూడా పెరుగుతున్నాయి. సినిమా ఆలస్యం వల్ల ఫైనాన్స్ వడ్డీల భారం పెరుగుతోంది. మొత్తంగా బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. అసలే సినిమాల బిజినెస్ అనుకున్నట్లుగా జరగడం లేదు. ఇలాంటి టైంలో బడ్జెట్ హద్దులు దాటిపోతే వర్కవుట్ చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates