పాత సినిమాలు చూడ‌డం మానేసిన మోహ‌న్ లాల్

ఏ న‌టుడైనా తాను న‌టించిన పాత సినిమాలు చూస్తే మంచి అనుభూతికి లోన‌వ‌డం స‌హజం. అందులోనూ త‌న‌ హిట్ సినిమాలను చూస్తే మ‌రింత ఆనందం క‌లుగుతుంది. కానీ త‌న‌కు మాత్రం త‌న పాత చిత్రాల‌ను చూస్తుంటే చాలా బాధ క‌లుగుతోంద‌ని అంటున్నాడు మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్. ఈ మ‌ధ్య ఆ సినిమాల‌ను చూడ‌డ‌మే మానేసిన‌ట్లు ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు లాలెట్ట‌న్. ఇందుకు ఆయ‌న చెప్పిన కార‌ణం.. అభిమానుల‌ను ఉద్వేగానికి గురి చేసింది.

కొంత కాలం కింద‌ట మోహ‌న్ లాల్ తన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ చంద్ర‌లేఖ సినిమా చూశాడ‌ట‌. తెలుగులో నాగార్జున హీరోగా అదే పేరుతో వ‌చ్చిన సినిమాకు మాతృక‌నే ఈ చిత్రం. మోహ‌న్ లాల్‌కు అత్యంత స‌న్నిహితుడైన ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే ఈ చిత్రంలో హాస్పిట‌ల్ నేప‌థ్యంలో వ‌చ్చే ఒక కీల‌క‌మైన స‌న్నివేశం చూసి మోహ‌న్ లాల్ చాలా బాధ ప‌డ్డాడ‌ట‌. ఆ స‌న్నివేశంలో త‌న‌తో పాటు న‌టించిన ఆర్టిస్టుల్లో ఎవ్వ‌రూ ఇప్పుడు జీవించి లేర‌ని.. అంద‌రూ చ‌నిపోయార‌ని.. ఈ విష‌యం తెలిసి త‌న‌కు చాలా బాధేసింద‌ని మోహ‌న్ లాల్ చెప్పాడు.

ఆయా న‌టుల‌తో త‌న‌కు ఎన్నో మంచి జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని.. అలాంటి న‌టులు ఇప్పుడు లేరు అని త‌లుచుకుంటే బాధేస్తుంద‌ని.. అందుకే  అప్పట్నుంచి తాను త‌న పాత చిత్రాల‌ను చూడ‌డం మానేసిన‌ట్లు మోహ‌న్ లాల్ తెలిపాడు. ఈ కామెంట్స్ మోహ‌న్ లాల్ అభిమానుల‌ను కూడా ఉద్వేగానికి గురి చేస్తున్నాయి.

ఈ ఏడాది ఎంపురాన్, తుడ‌రుమ్ చిత్రాల‌తో రికార్డ్ బ్రేకింగ్ హిట్లు కొట్టాడు మోహ‌న్ లాల్. ఇంత‌లోనే ఆయ‌న్నుంచి మ‌రో కొత్త సినిమా రాబోతోంది. అదే.. హృద‌య‌పూర్వం. మాళ‌విక మోహ‌న‌న్ ఇందులో కీల‌క పాత్ర పోషించింది. స‌త్యం అంతికాడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఓన‌మ్ కానుక‌గా ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం మీద మంచి అంచ‌నాలే ఉన్నాయి.