ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించినప్పటికీ.. యువ కథానాయకులతో పోటాపోటీగా వేగంగా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత కొంచెం నెమ్మదిగా అడుగులు వేసినప్పటికీ.. గత కొన్నేళ్లలో బాగా వేగం పెంచాడు. 2023 చివర్లో సలార్ మూవీతో పలకరించిన ప్రభాస్..ఇంకో ఏడు నెలలకే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంచెం ప్లానింగ్ సరిగ్గా ఉంటే ఈపాటికి రాజాసాబ్ కూడా రిలీజైపోయేది. ఆ చిత్రం వచ్చే సంక్రాంతికి వచ్చేలా కనిపిస్తోంది. రాజాసాబ్‌కు సంబంధించి కొంత చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ సినిమాలో నటిస్తూనే సమాంతరంగా హను రాఘవపూడి సినిమాలోనూ నటిస్తున్నాడు ప్రభాస్. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమా కూడా సగం దాకా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కోసం ఇంకో మూడు సినిమాల మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఐతే వాటిలో సలార్-2 మొదలు కావడానికి టైం పట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని రూపొందించాల్సిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో డ్రాగన్ తీస్తున్నాడు. కాబట్టి ఇంకో ఏడాది వరకు ఆ సినిమా ఊసేమీ ఉండదు. ఐతే ప్రభాస్ చేయాల్సిన మిగతా రెండు చిత్రాల మేకర్స్ తన కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని సెప్టెంబరు చివర్లో మొదలుపెడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. ఐతే కల్కి-2 మేకర్స్ కూడా వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ సినిమాకు స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ దాదాపుగా పూర్తయింది. ప్రభాస్ ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇది భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా. ప్రభాస్ సహకరిస్తూ అప్పుడప్పుడు కొన్ని కాల్ షీట్స్ ఇస్తే వాటిని సరిగ్గా వాడుకుని సినిమాను వేగంగా పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. వేరే సినిమాలు పూర్తయ్యే వరకు ఎదురు చూడాలని అశ్వినీదత్, నాగ్ అశ్విన్ భావించట్లేదు. ఇక సందీప్ రెడ్డి మాత్రం బల్క్ డేట్స్ అడుగుతున్నాడు. ప్రభాస్ తన సినిమా కోసం ఒకే లుక్‌లో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఈ సినిమాలో నటిస్తూ ప్రభాస్ వేరే చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేయడం అంటే అంత సులువు కాదు. మరి ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తాడన్నది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates