మంచి చేస్తున్న జూనియర్ మౌనం

గత రెండు వారాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన రెండు కీలక పరిణామాలు జరిగాయి. మొదటిది వార్ 2 రిలీజ్. దారుణమైన ఫలితం అందుకున్నప్పటికీ అనవసరమైన హైప్ ఇచ్చే ప్రయత్నాలు చేయకుండా ఓటమిని అంగీకరించి సైలెంట్ గా ఉండటం మంచిదే అవుతోంది. లేదంటే అనవసరమైన ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందనే వాస్తవాన్ని తనలాంటి స్టార్లు గుర్తించడం అవసరం. మరొకటి అనంతపురం ఎమ్మెల్యే వివాదాస్పద ఫోన్ కాల్ వ్యవహారం చాలా దూరం వెళ్లినా తారక్ వైపు నుంచి కనీసం ఖండించే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తెలివైన నిర్ణయమని చెప్పాలి.

ఎందుకంటే రాజకీయాలకు దూరంగా సినిమా కెరీర్ ని బలంగా నిర్మించుకునే పనిలో ఉన్న తారక్ ఇప్పుడు పొలిటికల్ కాంట్రావర్సిలకు దూరంగా ఉంటే మంచిది. పైగా సున్నితంగా మారిన వాతావరణంలో ఫ్యాన్స్ కి సంయమనం లేకపోయినా పర్వాలేదు కానీ హీరోకి మాత్రం ఉండాల్సిందే. లేదంటే ఈ అవకాశాన్ని వాడుకుని ప్రతిపక్షాలు, యాంటీ ఫ్యాన్స్ పెట్రేగిపోయే ప్రమాదముంది. ఇవన్నీ ఆలోచించే జూనియర్ ఎన్టీఆర్ దేనికి రెస్పాండ్ కావడం లేదని సన్నిహితుల మాట. హైదరాబాద్ లో అభిమానులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సైతం ఎందుకిది అవసరమాని ఫోన్ లో ప్రశ్నించాడు తప్ప మద్దతు ఇవ్వలేదని ఇన్ సైడ్ టాక్.

ఇక వార్ 2 ఎలాగూ వాషౌట్ అయిపోయింది కాబట్టి ఆ డిస్కషన్ మీద అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ అప్డేట్స్ వీలైనంత త్వరగా మొదలుపెట్టమని కోరుతున్నారు. అయితే రిలీజ్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి పబ్లిసిటీ మొదలుపెట్టే ఉద్దేశంలో లేరు. ఇంకోవైపు దేవర 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచుకున్న కొరటాల శివ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరికొన్ని స్టోరీ డిస్కషన్స్ జరగాల్సి ఉంది.