క్రికెట్ వెర్సస్ టెర్రరిజం.. ఈ ట్రైలర్ అదుర్స్

రెండు నెలల కిందట ‘సడక్-2’లో సినిమాతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు సంజయ్ దత్. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నటుల్లో ఒకరైన సంజయ్.. ఇలాంటి సినిమాలో నటించడమేంటి అంటూ ఆయన అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఆయన స్థాయికి అది ఎంతమాత్రం తగని సినిమా అన్నది వాళ్ల అభిప్రాయం. ఐతే ఆ మరకల్ని చెరిపేసే మంచి సినిమాతో సంజయ్ దత్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు.. టర్బాజ్.

నిరంతరం ఉగ్ర వాద పేలుళ్లతో, కార్యకలాపాలతో అట్టుడికే చోట పిల్లలతో క్రికెట్ ఆడించి వాళ్ల జీవితాల్ని బాగు చేయాలని చూసే క్రికెట్ కోచ్ పాత్రలో సంజయ్ కనిపించనున్నాడీ చిత్రంలో. ఈ సినిమా సెటప్ చూస్తే ఇది అఫ్గానిస్థాన్‌లో నడిచే కథలా ఉంది. అక్కడ రెఫ్యూజీ క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపే పిల్లలతో క్రికెట్ ఆడించడం కోసం కోచ్ పడే కష్టాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.

శరణార్థ శిబిరాల్లో క్రికెట్ ఏంటి అని అందరూ అభ్యంతర పెడుతుంటే.. ఈ క్రికెట్ కోచ్ మాత్రం ఆ పిల్లల ప్రతిభను వెలుగులోకి తేవాలని వారికి క్రికెట్లో శిక్షణ ఇస్తాడు. అలాగే వాళ్లను తేలిగ్గా తీసుకున్న వాళ్లతో మ్యాచ్ ఆడించి పిల్లల టాలెంట్ ఏంటో చూపిస్తాడు. ఐతే ఇది నచ్చక ఉగ్రవాద నాయకుడు కోచ్‌ను బందీగా తీసుకుని హింసించడం.. హీరో వారిపై పోరాడి గెలవడం.. ఈ నేపథ్యంలో ‘టర్బాజ్’ నడుస్తుంది.

ట్రైలర్లో హృద్యమైన సన్నివేశాలు చాలానే కనిపించాయి. ‘లగాన్’ తరహా క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఉందీ చిత్రం. నర్గీస్ ఫక్రి, రాహుల్ దేవ్ ఇందులో కీలక పాత్రలు పోషించగా.. గిరీష్ మాలిక్ దర్శకత్వం వహించాడు. థియేటర్లు అందుబాటులో లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల చేయబోతున్నారు. డిసెంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఒక క్లాసిక్ అనిపించుకునేలా ఉంది.