సోనియా సోనియా… ఇంతగా వినిపిస్తోందేంటయ్యా

కూలీలో నాగార్జున పోషించిన విలన్ పాత్ర అభిమానులకు పూర్తిగా నచ్చలేదన్నది దాస్తే దాగే నిజం కాదు. అందరూ ఒప్పుకునేదే. నాలుగు దశాబ్దాల నట ప్రయాణంలో సైకిల్ చైన్ తో మొదలుపెట్టి ఎన్నో మారణాయుధాలతో విలన్లను మట్టి కురిపించిన యువ సామ్రాట్ ఇలా రజినీకాంత్ చేతిలో చనిపోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అయితే తమిళనాడు జనాలకు మాత్రం సైమన్ బాగా ఎక్కేశాడు. స్టైల్, స్వాగ్ రెండూ మిక్స్ అయిన సూపర్ క్యారెక్టర్ అంటూ థియేటర్లలో తీసిన రీల్స్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దీనికి ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ఒక సినిమాకు కనెక్షన్ ఏర్పడుతోంది.

శివ డబ్బింగ్ ఉదయంతో కోలీవుడ్ ఫ్యాన్స్ కి పరిచయమైన నాగార్జున నటించిన ఒకే ఒక తమిళ స్ట్రెయిట్ మూవీ 1997లో విడుదలైన రచ్చగన్. తెలుగులో రక్షకుడుగా డబ్బింగ్ చేశారు. అప్పట్లో దీని మీద సాహో, కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో అంచనాలుండేవి. ట్రైలర్ తో హైప్ పెంచడమనే ట్రెండ్ దీంతోనే మొదలయ్యిందని చెప్పాలి. కానీ అంచనాలు అందుకోలేక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యింది. అయితే ఏఆర్ రెహమాన్ ఇచ్చిన అద్భుతమైన సంగీతం ఫ్లాప్ కాదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సోనియా సోనియా పాట,  మిగిలిన సాంగ్స్  జనాన్ని ఓ రేంజ్ లో ఊపేశాయి.

ఇప్పుడా సోనియా సోనియా పాటను మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చేశారు తమిళ అభిమానులు. ఇది ఎంతగా పాకిపోయిందంటే తమ ప్లాట్ ఫార్మ్ మీద ఈ సినిమా ఉందనే సంగతి మర్చిపోయిన ఓటిటిటిలు ఇప్పుడు చూడమంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీని తాలూకు క్లిప్పులు ఇన్స్ టా, ఎక్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లోనే రెహమాన్ సోనియా సోనియాని కంపోజ్ చేసిన తీరు ఇప్పటి మ్యూజిక్ లవర్స్ కు సైతం ఆకట్టుకునేలా ఉంటుంది. నాగార్జున, సుస్మిత సేన్ జోడి అప్పట్లో హాట్ టాపిక్. ఏదైతేనేం కూలీ తెలుగులో ఫ్లాప్ అయినా ఎప్పుడో ఫ్లాప్ అయిన పాత సినిమా పాట ఇప్పుడు హిట్టయ్యింది.