బాలీవుడ్ స్టార్ హీరోలకు వారసత్వం అంతగా కలిసి రావడం లేదనేది వాస్తవం. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. నెక్స్ట్ సినిమాకు బయ్యర్లు లేక మళ్ళీ ఓటిటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ ది సైతం ఇదే సమస్య. ఫ్లాపుల సంగతి పక్కనపెడితే కనీసం యావరేజ్ అనిపించుకునేలా నటించలేకపోతున్నారు. అమితాబ్ బచ్చన్ అంతటి లెజెండరీ స్టార్ కు ఈ తిప్పలు తప్పలేదు. అభిషేక్ బచ్చన్ ఎంత మంచి నటుడు అయినా టాప్ లీగ్ లోకి వెళ్లలేకపోయాడు. తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరుచుకోలేదు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ వంతు వచ్చింది. కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తన డైరెక్షన్ లో రూపొందిన బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. కంటెంట్ చూసిన విమర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు నార్కోటిక్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన కుర్రాడు ఇతనేనా అంటూ షాక్ అవుతున్నారు. హిందీ పరిశ్రమలో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ ని ఈ సిరీస్ ద్వారా ఆర్యన్ ఖాన్ చూపించబోతున్నాడు. ఇతని పనితనాన్ని మెచ్చుకున్న సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ స్పెషల్ క్యామియోలు చేయడం అంచనాలు పెంచుతోంది.
ఒకప్పుడు ఇదే ఆర్యన్ వల్ల తప్పు చేసినా చేయకపోయినా కారాగారంలో చూడాల్సి వచ్చి నరకం అనుభవించిన షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు పుత్రోత్సాహం దక్కేలా ఉంది. రిలీజ్ వచ్చే నెల కాబట్టి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూపం, గొంతు తండ్రి పోలికలను పుణికి పుచ్చుకున్న ఆర్యన్ ఖాన్ కు నటన కంటే దర్శకత్వం మీదే ఎక్కువ మక్కువట. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ సైతం ఇదే తరహాలో సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ పవన్ అకీరా నందన్ కూడా యాక్టింగ్ కంటే మ్యూజిక్ మీద ఎక్కువ మక్కువ చూపించడం ఈ మధ్య చూస్తున్నాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates